తెలుగు360 రేటింగ్ 2.75/5
మంచి సినిమాలు రెండు రకాలు..
కొన్ని చూసినంత సేపు బాగుంటాయి..
ఇంకొన్ని చూసిన తరవాత కూడా మళ్లీ మళ్లీ గుర్తొచ్చేలా ఉంటాయి.
ఇంటికెళ్లి గుర్తు చేసుకొన్నామంటే.. అది చాలా గొప్ప సినిమా అనే అర్థం. వాటిని తయారు చేయలేం. అలా.. వచ్చేస్తాయంతే. చాలామంది… ‘టైమ్ పాస్ అయిపోతే చాలు.. సేఫ్ జోన్ల పడిపోతాం’ అనుకుంటే.. ఒకటో రకం సినిమాలే తయారవుతుంటాయి. అలాంటి సేఫ్ జోన్ కథలకు కేరాఫ్ కనుక్కుని మరీ ప్రయాణం చేస్తున్నాడు రామ్! అంతకు ముందు మస్, యాక్షన్, హీరోయిజం అంటూ పడిగాపులు కాచి, మొట్టికాయలు తిన్న రామ్.. ‘నేను శైలజ’తో రూటు మర్చుకున్నాడు. ఇప్పుడు చేసిన ‘హలో గురు ప్రేమ కోసమే’ కూడా… తన సేఫ్ జర్నీలో మరో స్టేషన్ అంతే!
కథ
నువ్వు నాకు నచ్చావ్ చూశారా? థియేటర్లో మిస్ అయినా జెమినీ టీవీలో తెగ చూసుంటారు. కాబట్టి ఈ కథ గురించి మళ్లీ ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. అయినా సరే – ‘ఓ మాట అనేసుకుందాం’…
వెంకటేష్ ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రకాష్ రాజ్ ఇంట్లో దిగుతాడు. ప్రకాష్ రాజ్ చాలా మంచోడు. తన అమ్మాయికి ఏది బెస్టో అది ఇవ్వాలనుకుంటాడు. అమెరికా సంబంధం ఒకటి ఖాయం చేస్తాడు. నిశ్చితార్థం అయిపోయిన ఆర్తి అగర్వాల్ వెంకీని ఇష్టపడడం మొదలెడుతుంది.
చివరికి ‘మా నాన్నతో మీకున్న ఫ్రెండ్ షిప్ పాడవ్వకూడదని నా ప్రేమని వదులుకుంటున్నా’ అని ప్రేమని త్యాగం చేయలనుకుంటాడు. ‘అరె.. భలేవాడివే… ఇంతకంటే మంచి అల్లుడు నాకెలా దొరుకుతాడు’ అంటూ ప్రకాష్ రాజ్ కాళ్లు కడిగి కన్యాదానం చేసేస్తాడు. దాంతో సినిమా అయిపోతుంది.
ఇదంతా రివైండ్ చేసుకున్నాక… ‘హలో గురు ప్రేమ కోసమే’ కథ చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇంచుమించుగా.. ఇంచు అటూ ఇటుగా ఈ కథ కూడా అంతే. నువ్వు నాకు నచ్చావ్లో ఆర్తి అగర్వాల్ వెంకటేష్‌ని ప్రేమిస్తే.. వెంకీకి ప్రేమ ఉన్నా అది తన మనసులోనే దాచుకుంటాడు.
ఇక్కడ కాస్త రివర్స్ ముందు రామ్ ప్రేమిస్తాడు. రామ్ కి మీద తనకు ప్రేమ ఉన్నా హీరోయిన్ అది బయటపెట్టకుండా తన మనసులో దాచుకుంటుంది.
అక్కడ ప్రకాష్ రాజ్ – చంద్రమోహన్ ఫ్రెండ్సు
ఇక్కడ ప్రకాష్ రాజ్ – సితార ఫ్రెండ్స్..
ఇలా చెప్పుకుంటూ పోతే.. కథలో, పాత్రల్ని తీర్చిదిద్దిన విధానంలో, సన్నివేశాల రూపకల్పనలో కొన్ని పోలికలు కనిపిస్తాయి.
విశ్లేషణ
దిల్‌రాజుకి ఎందుకో తండ్రి పాత్రపై ఎనలేని ప్రేమ. దీనిపై ఫిల్మ్ ఇండ్రస్ట్రీలో ఓ జోకు కూడా ఉంది.. ‘నువ్వు ఎలాంటి కథైనా చెప్పు.. దాంట్లో తండ్రి పాత్రని హైలెట్ చేసి రాసుకో.. ఆ కథ దిల్ రాజుకి తప్పకుండా నచ్చేస్తుంది’ అని. త్రినాధరావు నక్కిన అదే సూత్రం పాటించేశాడు. ఓ ఉత్తమ తండ్రి… తన కూతురికి ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు.. చివరికి తన కూతుర్ని ప్రేమించినవాడితో సైతం ఫ్రెండ్ షిప్ చేస్తాడు.. అనేసరికి దిల్‌రాజు పొంగిపోయి.. ఇది ‘నువ్వు నాకు నచ్చావ్‌కి సరికొత్త వెర్షన్’ అని కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేశాడు. అయితే త్రినాధరావు నక్కిన మిగిలిన విషయాల్లో అశ్రద్ధ చేయలేదు. వినోదం పండించడం తన బలం. దాన్ని దాదాపు ప్రతీ సీనులోనూ బలంగానే చూపించుకున్నాడు. మరీ ముఖ్యంగా.. రామ్ ట్రైనింగ్ క్లాస్ ఎపిసోడ్ బాగా నవ్విస్తుంది. అఫ్ కోర్స్ అది కాస్త ‘వైవా హర్ష’ యూ ట్యూబ్ వీడియోలకు దగ్గరగా ఉన్నా… పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాఫీ షాపులో ప్రణీత – రామ్ మధ్య నడిచిన సీన్ కూడా బాగానే నవ్వించింది. ప్రణీత ఇంట్లో సురేష్‌కి రామ్ దొరికిపోయే ఎపిసోడ్ అయితే… ఫస్టాఫ్ ని నిలబెట్టేస్తుంది. ఈ సినిమాలో నవ్వించే ఎపిసోడ్లు ప్రధానంగా ఇవే.
విశ్రాంతి తరవాత ప్రకాష్ రాజ్ – రామ్ సన్నివేశాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు దర్శకుడు. బహుశా ఈ కథని తండ్రి కోణంలోంచి చెబితే… కుటుంబ ప్రేక్షకులకూ నచ్చుతుంది అన్నది దిల్‌రాజు ఉద్దేశం కావొచ్చు. ఓ కూతురికి తండ్రిగా – ఓ కుర్రాడికి స్నేహితుడిగా ఓ తండ్రి ద్విపాత్రాభినయం చేయడం కొంత కొత్తగా అనిపిస్తుంది. ఆమేర ఆ సన్నివేశాలన్నీ ఆకట్టుకున్నట్టే. అయితే.. ఈ కథంతా కేవలం ఈ పాయింట్‌పైనే తిరగడం వల్ల పోను పోను.. అక్కడా రొటీనిటీ వచ్చేస్తుంది. ఏ కథకైనా సంఘర్షణ చాలా ముఖ్యం. అది.. హలో గురూలో తేలిపోతుంది. ‘వీడు మరీ మంచోడెహె.. తన కూతుర్ని ప్రేమించినవాడికే ఇచ్చి పెళ్లి చేసేస్తాడు’ అన్న ఫీలింగ్ ఈ సినిమా మొదలైన కాసేపటికే కలిగేస్తుంది. దాంతో..
కథలో కాన్లిక్ట్కి చోటు లేకుండా పోయింది. పతాక సన్నివేశాలన్నీ మళ్లీ ‘పరుగు’ని గుర్తుకు తీసుకొస్తాయి. అవీ.. ఊహించినట్టే సాగాయి. ప్రతీ సన్నివేశంలోనూ స్పేస్ తీసుకుని చెలరేగిపోయిన రచయిత.. ఇక్కడ మాత్రం రొటీన్ డైలాగులతో నడిపించాడు. ఇక్కడ కూడా తన కలం బలం చూపిస్తే… క్లైమాక్స్ రిజిస్టర్ అయిపోదును. కానీ… ‘ఇక్కడ ఎలాగైనా కథ ముగించాల్సిందే’ అనుకుని.. టప టప లాగించేశారు.
నటీనటులు
నేను శైలజ తరవాత రామ్ మారాడు. ఆ మార్పు ఈ సినిమాలోనూ కనిపించింది. నేను హీరోని… ప్రతీసారీ నేనే గెలవాలి.. అనుకోకుండా కథ ప్రకారం, పాత్ర ప్రకారం నడుచుకుంటున్నాడు. అది తనకే కాదు, సినిమాకీ ప్లస్ అవుతోంది. తన జోష్, కామెడీ టైమింగ్ ఈ సినిమాకి ప్రధాన బలం. ‘ఓ…….’ అంటూ చెప్పే మేనరిజం కూడా బాగా నప్పింది. అనుపమకి తొలి సగంలో అసలు మటలే లేవు. కేవలం తను.. ఓ పాసింగ్ పాత్ర అంతే. ద్వితీయార్థమూ అంతే. కాకపోతే ఫస్టాఫ్‌తో పోలిస్తే కాస్త బెటర్. ‘నువ్వు నన్ను లేపుకుపో..’ అని సడన్‌గా చెబితే రామ్‌నే కాదు.. ప్రేక్షకులూ షాక్ అయిపోతారు. అసలు అంతగా వాళ్లిద్దరి మధ్య ఏం కెమిస్ట్రీ నడిచింది? అనిపిస్తుంది. ప్రతీసారీ ‘మా నాన్న… మా నాన్న’ అని చెప్పి నాన్న పాత్రని ఆ స్థాయికి తీసుకెళ్లిన కథానాయిక పాత్ర చివర్లో నాన్న గురించి ఆలోచించకపోవడం – పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రకాష్ రాజ్ ‘మంచి నాన్న’ ముద్ర పడిన పాత్రలో మరోసారి రాణించాడు. ఈవాళ్లి రోజుల్లో ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కువగా రావు రమేష్ పట్టుకెళ్లిపోతున్నాడు. ‘నన్ను మర్చిపోయారేమో.. నా బ్రాండ్ పాత్రలివే’ అని చెప్పుకోవాలనేమో ఈసారి కాస్త పద్ధతిగా నటించాడు ప్రకాష్‌రాజ్. మిగిలిన వాళ్లంత అనుభవజ్ఞులే కాబట్టి.. ఎవ్వరి నటనకూ వంక పెట్టలేం.
సాంకేతిక వర్గం
దేవిశ్రీ ప్రసాద్ పాటల వల్ల సినిమాలు హిట్టయిన సందర్భాలున్నాయి. యావరేజ్ కథని తన పాటలతో గెలిపించేస్తాడు. బహుశా తనపై నమ్మకంతో త్రినాథరావు యావరేజ్ కథతో రిస్క్ చేశాడేమో. కానీ దాన్ని హిట్ చేసేంత స్థాయిలో దేవి పాటలు లేవు. నేపథ్య సంగీతం కూడా మరీ హాంటింగ్ గా అనిపించలేదు. దిల్‌రాజు క్వాలిటీ విషయంలో రాజీ పడడు. ఈసారీ అంతే. కానీ మరీ విచ్చలవిడిగా మాత్రం ఖర్చు పెట్టలేదు. పొదుపు పద్ధతులు పాటించి, తక్కువ లొకేషన్లలో సినిమా పూర్తి చేశారు. మాటలు బాగున్నాయి. చాలా చోట్ల కొత్తగా అనిపించాయి. ఎమోషనల్ డైలాగులు రాసేటప్పుడు మాత్రం ఇంకాస్త బాగుండాల్సింది. రొటీన్ కథలకు కాలం చెల్లింది. అయితే వినోదం జోడించగలిగితే పాస్ అయిపోవొచ్చు.
త్రినాధరావు ఎంతసేపూ ‘పాస్ అయిపోతే చాలు’ అనే దృష్టితోనే కథల్ని ఎంచుకుంటున్నాడు. ఈ సేఫ్ జోన్ వదలకపోతే.. ఆయన దర్శకుడిగానూ యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోవాల్సివుంటుంది.
తీర్పు
హలో గురూ… వినోదానికి ఢోకా లేని సినిమా. చూస్తున్నంత సేపు బాగుంటుంది. అంతే తప్ప.. ‘అరె భలే సినిమా చూశామే’ అన్న ఫీలింగ్ మాత్రం తీసుకురాదు. దీనికి ఫిక్సయిపోతే… మీ టికెట్టు రేటు గిట్టుబాటు అయిపోయినట్టే.
ఫైనల్ టచ్: ‘నువ్వు నాకు నచ్చావ్’ – 2018
తెలుగు360 రేటింగ్ 2.75/5