సాధారణంగా టీజర్, ట్రైలర్ అంటే ఓ సంప్రదాయం ఉంది. సినిమాలోని బిట్లు అక్కడక్కడ కట్ చేసి… ఓ డైలాగో, పంచో వినిపించి.. కథ ఇది అని సూక్ష్మంగా చెప్పి వదిలేస్తారు. ఈ సంప్రదాయాన్ని కాస్త బ్రేక్ చేసింది `హలో గురు ప్రేమ కోసమే` టీజర్. రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రమిది. దిల్‌రాజు నిర్మాత. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. టీజర్ విడుదలైంది. పొద్దుటే తలస్నానం చేసి, సాంబ్రాణి పొగల మధ్య తల ఆరేసుకుంటున్న హీరోయిన్… చాటుగా నడుముని చూస్తూ.. రొమాంటిక్ ఫీల్‌లోకి వెళ్లిపోయిన హీరో.. వాళ్లిద్దరి మధ్య సాగిన సరదా సంభాషణ… ఇంతే! కాకపోతే… ఈ టీజర్ చూస్తే. సినిమా బాగా రొమాంటిక్‌గా సాగబోతోందన్న విషయం మాత్రం అర్థమవుతోంది. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్లకు మంచి రోజులొచ్చాయి. `గీత గోవిందం` ఇలాంటి కథే కదా? ఆ సినిమా టీజర్ కూడా ఇలాంటి రొమాంటిక్ ఫీల్ తోనే కట్ చేశారు. ఇప్పుడు.. ఆ స్ఫూర్తితో `హలో గురు…` టీజర్‌ని కట్ చేసి ఉండొచ్చు. రామ్‌కి హిట్టు కావాలి. అనుపమకీ అది అవసరమే. ఇద్దరి జంట తెరపై చూడముచ్చటగా ఉంది. 30 సెకన్ల టీజర్లో కనిపించిన రొమాన్స్ తెరపై కనీసం అరగంట కనిపించినా… సినిమా హిట్టయిపోవడం ఖాయం.