“హలో…ఇది భూమండలమేనా?” అని ఫోన్ లో ఎవరయినా మనల్ని అడిగితే ఏమనుకొంటాము? “ఏమిటీ పిచ్చి ప్రశ్న? భూమండలం కాకపోతే స్వర్గంలోనో…పాతాళంలోనో…అంతరిక్షంలోనో…ఉన్నామనుకొంటున్నాడా…మనమేమయినా?” అని విసుకొని టపీమని ఫోన్ పెట్టేస్తాము. ఎవరో పిచ్చివాడో లేదా ఆకతాయి కుర్రాడో చేసాడనుకొంటాము. కానీ మొన్న గురువారం లండన్ లో ఒక మహిళకు ఫోన్ వచ్చినప్పుడు నిజంగానే ఈ ప్రశ్న వినపడింది. దానికి ఆమె కూడా ఇలాగే జవాబు చెప్పిందో లేదో తెలియదు కానీ ఆ ఫోన్ మాత్రం భూమండలం మీద నుండి వచ్చిన ఫోన్ కాల్ మాత్రం కాదు. భూమికి 400 కిమీ దూరంలో అంతరిక్షంలో ఏర్పాటు చేయబడిన అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుండి వచ్చిన ఫోన్ కాల్ అది. అందుకే అ ఫోన్ చేసిన టిమ్ పీక్ అనే వ్యోమగామి “హలో ఇది భూమండలమేనా?” అని అడిగారు.
ఆయన అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఆరు నెలలపాటు పరిశోధనలు చేయడానికి నెల రోజుల క్రితమే అక్కడికి చేరుకొన్నాడు. ఆయన తన కుటుంబానికి ఫోన్ చేయబోయి పొరపాటున వేరే నెంబరుకి చేయడంతో ఆ కాల్ అందుకొన్న మహిళ కూడా “ఏమిటీ పిచ్చి ప్రశ్న?” అని అని విసుక్కొంటూ ఫోన్ పెట్టేసింది. “ఆ మహిళకు ఫోన్ చేసి హలో…ఇది భూమండలమేనా? అని అడిగినందుకు నేను ఆమెకు క్షమాపణలు తెలుపుకొంటున్నాను. అది ఆకతాయితనంతో చేసింది కాదు. పొరపాటున రాంగ్ నెంబర్ డయల్ చేయడం వలన జరిగింది.” అని ట్వీట్ మెసేజ్ పెట్టారు. టిమ్ పీక్ పెట్టిన ఆ ట్వీట్ మెసేజ్ తో ఈ అసక్తికరమయిన విషయం ఈ భూమండలంలో ఉన్నవారందరికీ తెలిసింది.