ఆంధ్రాకి కేంద్రం చేయాల్సిన దానికంటే ఎక్కువే చేసిందని, ఇవ్వాల్సిదానికంటే ఎక్కువే ఇచ్చేసిందన్నది భాజపా వాదన. అయితే, ఇప్పుడు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని ఏపీ రాష్ట్ర భాజపా నిర్ణయించింది. విజయవాడలో రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం జరిగింది. దీన్లో ఏపీ భాజపా అధ్యక్షుడు, విశాఖ పార్లమెంటు సభ్యుడు హరిబాబు పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేశామన్నారు. చట్టంలో లేని అంశాలను కూడా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందన్నారు. అయినాసరే, భాజపాపై విమర్శలు పెరుగుతున్నాయనీ, వీటిని సమర్థంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. మనం ఏం చేశామో ప్రజలకి అర్థమయ్యే రీతిలో ప్రచారంగా తీసుకెళ్లాలని హరిబాబు పిలుపునిచ్చారు.
ఇప్పుడు ఏవైతే అంశాల్లో ఆంధ్రాకి అన్యాయం జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయో, వాటన్నింటిపైనా కేంద్రం ఏం చేయబోతోందన్నది మాత్రం సూటిగా స్పష్టంగా చెప్పలేకపోయారు. విభజన చట్టంలో ఉన్నట్టుగా విశాఖ రైల్వేజోన్, పోర్టు, ఉక్కు పరిశ్రమల అంశాలు కేంద్ర పరిశీలనలో ఉన్నాయన్నారు. రైల్వేజోన్ విషయమై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయనీ, అలా అభ్యంతరాలు వ్యక్తం చేసినవారితో కేంద్రం చర్చలు జరుపుతోందని హరిబాబు చెప్పారు. మెట్రో ప్రాజెక్టులపై కూడా కేంద్రం సానుకూలంగానే ఆలోచిస్తోందన్నారు. రెవెన్యూలోటుపై ఇంకా స్పష్టత లేదన్నారు. ఆ స్పష్టత రాగానే ఏపీకి ఉన్న లోటును కేంద్రం భర్తీ చేస్తుందనే స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కట్టుబడి కృషి చేసిన పార్టీ ఒక్క భాజపా మాత్రమేననీ, అయితే.. అప్పట్లో నోరు మెదపనివారు కూడా ఇప్పుడు భాజపాపై విమర్శలు చేస్తున్నారని హరిబాబు ఆరోపించారు.
విచిత్రం ఏంటంటే… ఆంధ్రా కేటాయింపులకు సంబంధించి అందరూ ప్రజల్లోకే వెళ్తామంటున్నారు! విభజన చట్టంలో కీలక అంశాలపై ఇన్నాళ్లూ మీనమేషాలు లెక్కపెట్టిన భాజపా కూడా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తుందట..! ఇంతకీ వీరు ప్రజల్లోకి వెళ్లి ఏం ప్రచారం చేస్తారు..? ఇవ్వాల్సినవన్నీ పరిశీలనలో ఉన్నాయనీ, కేంద్రం ఆలోచిస్తోందనీ, అధ్యయనం చేస్తున్నామనీ, ఆమోదయోగ్యమైన పరిశీలనా మార్గాలను అన్వేషిస్తున్నామనీ… ఇవే కదా వారు చెప్పగలిగేవి..! చట్టంలో చెప్పినట్టుగా విద్యా సంస్థలు ఇచ్చామని హరిబాబు చెబుతారు! అయితే, ఆ విద్యా సంస్థలు కేంద్రం అధీనంలో పనిచేస్తాయి కదా.. వాటి కేటాయింపుల హెచ్చుతగ్గుల గురించి రాష్ట్రానికి ఏం అవసరం అన్నట్టుగా సోము వీర్రాజు మాట్లాడతారు. పోలవరం తామే కడుతున్నామంటారు. ఇవి కాకుండా ఆంధ్రా ప్రజల్లోకి భాజపా తీసుకెళ్లాల్సిన అంశాలు ఇంకా ఏమున్నాయి..?