బిగ్ బాస్ హౌస్ నుంచి హేమ అనూహ్యంగా ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్‌లో బలమైన పోటీదారునిగా అడుగుపెట్టిన హేమ… ఇంత త్వరగా, అదీ తొలి వారంలోనే బయటకు వచ్చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆఖరికి హేమ కూడా… ఈ షాక్ నుంచి తేరుకోలేకపోతోంది. ఎలిమినేషన్ సమయంలో కాస్త స్పోర్టివ్‌గానే కనిపించిన హేమ, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కాస్త ఘాటైన విమర్శలే చేస్తోంది. ఈ షో విషయంలో తనకు అన్యాయం జరిగిందని, ముందు నుంచీ `మా`టీవీ తనపై వివక్ష చూపిస్తోందని వాపోతోంది. తనపై కనీసం ప్రోమో కూడా కట్ చేయలేదని, గూగుల్‌లో ఎక్కువ శాతం ఓట్లు వచ్చినప్పటికీ, హాట్ స్టార్ లో వచ్చిన ఓట్లే లెక్క పెట్టారని వాపోతోంది. బిగ్ బాస్ ఇంట్లో జరిగిన విషయాలేవీ.. జరిగింది జరిగినట్టు టీవీలో చూపించడం లేదని, లోపల చాలా గొడవలు జరుగుతున్నాయని, అయితే చాలా విషయాలు సెన్సార్ అవుతున్నాయని, దాంతో అసలు నిజానిజాలేమిటో ప్రేక్షకులకు తెలియకుండా పోతోందని ఆరోపిస్తోంది. తనని అక్కా అంటూ ప్రేమగా పిలుస్తూనే, తెర వెనుక ఎలిమినేట్ చేయడానికి తతంగం నడిపారని, మొత్తంగా చూస్తే తనని కావాలనే బయటకు పంపించేశారని అర్థమవుతోందని సంచలన ఆరోపణలు చేసింది.