ఉత్తరప్రదేశ్ లోని మథుర నగరంలో గత రెండు రోజులుగా అల్లర్లు జరుగుతున్నాయి. ఆ అల్లర్లలో ఒక పోలీస్ ఎస్.పి.తో సహా 24 మంది మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. అల్లర్ల నియంత్రించడానికి పారా మిలటరీ దళాలను కూడా వినియోగిస్తే గానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. పోలీసులు ఇంతవరకు సుమారు 250 మందిని అరెస్ట్ చేశారు. నగరంలోని జవహార్ బాగ్ అనే ప్రాంతంలో అధికారులు పోలీసుల సహాయంతో ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేసినప్పుడు బస్తీవాసులు తిరుగబడ్డారు. ఇరు వర్గాలకి మధ్య జరిగిన ఘర్షణలలో 24మంది మరణించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ అంశం మీద రాష్ట్రంలో అధికార సమాజ్ వాదీ ప్రభుత్వానికి, ప్రతిపక్ష భాజపాకి మధ్య అప్పుడే మాటల యుద్ధం మొదలయింది. విశేషం ఏమిటంటే మథుర నియోజక వర్గానికి ప్రముఖ బాలీవుడ్ నటి హేమ మాలిని భాజపా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా ఆమెకి ఈ సంగతి తెలియక పోవడం చాలా విచిత్రమే. ఈ సంగతులేవీ తెలియని ఆమె తను చేస్తున్న ఒక హిందీ సినిమా షూటింగ్ విశేషాలను, షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఆమె దిగిన కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అదిచూసి నెటిజెన్స్ విమర్శలు కురిపించిన తరువాత కానీ తన నియోజక వర్గంలో ఇంత పెద్ద సంఘటనలు జరుగుతున్నాయని ఆమెకి తెలియలేదు. వెంటనే ట్విట్టర్ లో తను పోస్ట్ చేసినవన్నీ చెరిపేసి, గొడవలలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి సందేశం పెట్టారు. ఇదీ మన సినీ ఎంపిల పరిస్థితి. ప్రజాసేవ చేస్తామని రాజకీయాలలోకి వస్తారు. వారికున్న ప్రజాకర్షణతో ఎన్నికలలో పోటీ చేసి గెలుస్తారు. తరువాత మళ్ళీ తమ సినిమా షూటింగులకే ప్రాధాన్యత ఇస్తారు. తమ నియోజక వర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం, నోయోజక వర్గం అభివృద్ధి సంగతి దేవుడెరుగు. కనీసం అక్కడ ఏమి జరుగుతోందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. హేమమాలిని తీరు చూస్తే రోమ్ నగరం తగులబడిపోతుంటే ఫిడేల్ వాయించుకొంటూ కూర్చొన్న నీరో చక్రవర్తి గుర్తుకు రాకమానడు. అటువంటి వారికి ప్రజలు ఓట్లు వేసి ఎందుకు గెలిపిస్తారో?