హైదరాబాద్: మొన్న గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ చరిత్రలోనే రికార్డ్ మెజారిటీతో గెలిచిన అభ్యర్థి – టీఆర్ఎస్కు చెందిన సామల హేమ. 22 ఏళ్ళ ఈ యువతికి మరో ఘనత కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా యువతీ యువకులు ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయాలనుకునే ప్రతిష్ఠాత్మక కార్పొరేట్ సంస్థ గూగుల్‌లో ఉద్యోగాన్ని వదిలి ఈ కార్పొరేటర్ ఎన్నికలకోసం ఆమె రాజకీయాలలోకి ప్రవేశించారు. 2014 ఎన్నికల నాటికి ఈ యువతికి ఓటు హక్కు కూడా లేదు. ఓటుకోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఓటర్ జాబితాలో పేరు లేకపోవటంతో ఓటు వేయలేదు. ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటు హక్కు వచ్చింది. తొలి ఓటు తనకే వేసుకోవటం విచిత్రంగా ఉందని చెబుతున్నారు హేమ. చిన్నప్పటినుంచి స్లమ్ ఏరియాలోనే పెరిగానని ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సీతాఫల్మండి ప్రాంతంలో పేద, మధ్యతరగతి కుటుంబాల మధ్య పెరగటంతో ఎన్నికల్లో జనాలకు కలిసిపోవటానికి కష్టపడనవసరం లేకపోయిందని అన్నారు. ఆమె తండ్రి కరాటే రాజు గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. ఈసారి కూడా ఆయనకే టికెట్ వస్తుందనుకుంటుండగా అనుకోకుండా మంత్రి పద్మారావుగౌడ్ హేమను అభ్యర్థిగా నిర్ణయించారు.
ఏడు నెలల క్రితమే హేమ గూగుల్‌లో చేరారు. టీమ్ లీడర్‌గా ప్రమోషన్ వచ్చే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. కార్పొరేట్ జాబ్‌ను, ఐదంకెల జీతాన్ని వదులుకుని కార్పొరేటర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. గూగుల్‌కు ముందు జెన్పాక్ట్లో చేశారు. జాబ్ చేస్తూనే కీసరలోని అశ్విత్ జీసస్ కాలేజిలో ఫైనాన్స్‌లో ఎంబీఏ చదివారు. ప్రచారంలో కేటీఆర్ వచ్చినపుడు ఆయనతో సెల్ఫీ తీసుకుంటే, సెల్ఫీలే దిగుతున్నావా, ప్రచారంకూడా చేస్తున్నావా అని అడిగారని హేమ చెప్పారు. గెలిచిన తర్వాత సీఎమ్ కేసీఆర్‌ను కలవటానికి వెళ్ళినపుడు పద్మారావు పరిచయం చేయగానే, గూగుల్ కదా అన్నారని హేమ తెలిపారు.