బిగ్‌బాస్ నుంచి వారంలోనే ఎలిమినేట్ అయిన సినీ నటి హేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. బిగ్ బాస్‌లోకి వెళ్లే ముందే.. తాను.. కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని.. రాజమండ్రిలో ఇల్లు కూడా కట్టుకుంటున్నానని ప్రకటించిన హేమ… బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే… దానికి సంబంధించిన కార్యచరణ ప్రారంభించారు. సోమవారం.. బిగ్‌బాస్ హౌస్‌లో తనకు అన్యాయం జరిగిందని ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన.. హేమ.. మంగళవారం నేరుగా ప్రెస్‌మీట్ పెట్టారు. అందులో తన రాజకీయ ఆకాంక్షలను వివరించారు.
జగన్ పార్టీ అంటే తనకు ఎంతో ఇష్టమని హేమ ప్రకటించుకున్నారు. ఎన్నికల సమయంలో.. జగన్ పార్టీలో జాయిన్ అవ్వలేదు కానీ సపోర్ట్ చేశానన్నారు. అయితే రాజకీయాల్లోకి వెళ్తున్నంత మాత్రాన సినీ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లాలని అనుకోవడం లేదని … ఇండస్ట్రీలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. గతంలో ముద్రగడతో కలిసి.. హేమ కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో అప్పుడప్పుడూ పాల్గొన్నారు. తాజాగా.. ఈ అంశంపై జరుగుతున్న రచ్చ విషయంలో.. హేమ.. తాను చేరాలనుకుంటున్న పార్టీకి అండగా నిలిచారు. కాపు రిజర్వేషన్లపై ఎన్నికల ముందే జగన్ స్పష్టత ఇచ్చారని .. కాపు రిజర్వేషన్లపై జగన్ మాట మార్చడం లేదని సర్టిఫికెట్ ఇచ్చారు.
రాజకీయాల్లోకి వచ్చే ముందు నేను ఎంత వరకు సమాధానం చెప్పగలుగుతానో.. తెలుసుకోవడానికే బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లానని చెప్పుకున్నారు. హేమ గతంలోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జైసమైక్యాంధ్ర పార్టీ తరపున మండపేట నుంచి పోటీ చేశారు. కనీసం వెయ్యి ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆమెకు రాజకీయంగా అండగా ఉన్నారన్న ప్రచారం జరిగింది. అయితే… ఇప్పుడు పరిస్థితి మారింది. ఆమె వైసీపీలో చేరి తన రాజకీయ భవిష్యత్ ను తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు. అదే విషయాన్ని తన మాటల్లో వ్యక్తం చేశారు.