హైదరాబాద్: ముంబాయి నగరంలో సంచలనం సృష్టించిన కళాకారిణి హేమ ఉపాధ్యాయ్, ఆమె లాయర్ జంట హత్యల కేసు మిస్టరీ వీగిపోయింది. ఆమె భర్త చింతన్ ఉపాధ్యాయ్ ఈ హత్యలను చేయించినట్లు పోలీసులు కనిపెట్టారు. హేమ ఉపాధ్యాయ్, ఆమె న్యాయవాది హరీష్ భంభాని శవాలు ఈనెల 12న ముంబాయిలోని కండివ్లి ప్రాంతంలో బయటపడ్డాయి. పెయింటింగుల వ్యాపారి విద్యాధర్ రాజ్‌భర్ ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ హత్యలు చేయించినట్లు మొదట భావించినప్పటికీ, పోలీసులు దర్యాప్తులో భర్తే ఈ హత్యల వెనక ఉన్నాడని తేలింది. చింతన ఈ హత్యలను చేయటానికి విద్యాధర్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు పోలీసులు ఇవాళ ముంబాయిలో చెప్పారు. చింతన్ దీనికోసం రెండు నెలల క్రితమే ప్లాన్ చేసినట్లు తెలిపారు. అతనికి, హేమకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. వీరు 2010లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. భరణం గురించి వివాదం నడుస్తోంది. హేమను చంపాలన్నది హంతకుల ఉద్దేశ్యం అయినప్పటికీ, సాక్ష్యాధారాలను వదలగూడదనే ఉద్దేశ్యంతో ఆమె న్యాయవాది హరీష్‌ను కూడా చంపేశారు. చింతన్ కూడా కళాకారుడే. అతనిని నిన్న ముంబై పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. హంతకులను వారణాసిలో నాలుగు రోజుల క్రితమే అరెస్ట్ చేశారు.