Her Movie Telugu Review
రేటింగ్: 2.5/5
ఓటీటీలు వచ్చాక సినిమాలకు కొత్త ఛాలెంజ్‌లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా క్వాలిటీ విషయంలో. ఓటీటీలో వైవిధ్యభరితమైన కంటెంట్ ఉంది. దాన్ని మించిన కథా, కథనాలతో సినిమాలు తీస్తే కానీ, వర్కవుట్ అవ్వడం లేదు. ముఖ్యంగా థ్రిల్లర్ సరంజామా ఓటీటీలో కావల్సినంత ఉంది. ప్రతీ పది వెబ్ సిరీస్‌లలో ఆరో, ఏడో థ్రిల్లర్లే. ట్విస్టులూ, టర్న్ లతో నింపేస్తే తప్ప, థ్రిల్లర్లు ఓ పట్టాన ఎక్కడం లేదు. సాదా సీదా సినిమాలకు ఇప్పుడు వెండి తెరపై చోటు లేదు. ఓ థ్రిల్లర్ తీస్తున్నామంటే ఔట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా ఏదో ఉండాల్సిందే. ముఖ్యంగా చిన్న సినిమాలు, స్టార్ బలం లేని సినిమాలకు అది మరింత అవసరం. ఇప్పుడు వెండి తెరపైకి మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వచ్చింది. అదే… HER. చిలసౌతో ఆకట్టుకొన్న రుహానీ శర్మ.. తొలిసారి చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొనేలానే ఉన్నాయి. మరి సినిమాలోనూ అంతే కంటెంట్ ఉందా? ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్ ఇవ్వగలిగిందా..?
హైదరాబాద్ శివర్లలో విశాల్, స్వాతి అనే ఇద్దర్ని గుర్తు తెలియని దుండగులు హత్య చేస్తారు. ఈ కేస్‌ని ఏసీపీ అర్చన (రుహానీ శర్మ) డీల్ చేస్తుంది. అన్ని కోణాల్లోంచి స్టడీ చేసి కొంతమంది నిందితుల్ని ఐడెంటిఫై చేస్తుంది. వాళ్లందరినీ ఒకొక్కరిగా విచారిస్తుంటుంది. అయితే ప్రతీ చోటా.. డెడ్ ఎండ్ ఎదురవుతుంటుంది. మరోవైపు కేశవ అనే నేరస్తుడ్ని పట్టుకోవాలన్నది తన టార్గెట్. ఎందుకంటే కేశవ వల్ల తన జీవితంలో అమూల్యమైన వ్యక్తిని పోగొట్టకోవాల్సివస్తుంది. ఆ కేశవకీ, విశాల్, స్వాతి మర్డర్ కేసుకీ ఓ లింక్ ఉన్న విషయం అర్చన తన ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకొంటుంది. మరి ఈ హత్యలు కేశవనే చేశాడా? అసలు కేశవతో అర్చనకు ఉన్న లింక్ ఏమిటి? ఈ జంట హత్యల కేస్‌ని అర్చన ఎలా సాల్వ్ చేసింది? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిన విషయాలే.
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటేనే ఎక్కువ భాగం ఓ హత్య, హిడ్నాప్ వీటి చుట్టూనే ముడిపడి ఉంటాయి. ఈ సినిమా కూడా అంతే. జంట హత్యలతో నేరుగా కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. ఆ వెంటనే రుహానీ ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ కూడా మొదలైపోతుంది. రుహానీకి ఫ్లాష్ బ్యాక్‌లో ఓ లవ్ స్టోరీ ఉన్నా, దానికి పెద్దగా సమయం కేటాయించలేదు. కథాగమనానికి అడ్డు పడకుండా ఆ లవ్ స్టోరీని చాలా వేగంగా ముగించి, మళ్లీ ఇన్వెస్టిగేషన్లోకి వచ్చేశాడు దర్శకుడు. థ్రిల్లర్స్ మొదటి లక్షణం.. కథకి అవసరం లేని విషయాల జోలికి వెళ్లకపోవడమే. దాన్ని దర్శకుడు బాగా పాటించాడు. కథకేం కావాలో.. అదే చెప్పాడు. ఇన్వెస్టిగేషన్లో అక్కడక్కడ కాస్త ఆసక్తి, ఇంకాస్త నీరసం కనిపిస్తుంటాయి. సాధారణంగా ఏ కేసులో అయినా.. ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలోనే ప్రధాన పాత్ర తెలివి తేటల్ని, సామర్థ్యాన్ని ఎలివేట్ చేసే అవకాశం దక్కుతుంది. ఇక్కడ అది అంతగా కనిపించలేదు. సినిమా అంతా ఒకే పాయింట్ చుట్టూ తిప్పడం సామాన్యమైన విషయం కాదు. పకడ్బందీ స్క్రీన్ ప్లేతోనే అది సాధ్యం అవుతుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ లో… ఓ పోలీస్ ఆఫీసర్ని ఈ కేసులో ఇరికించడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
అయితే ద్వితీయార్థంలో మళ్లీ… కథ మొదటికి వస్తుంది. విచారణలో వేగం లేకపోవడం, అతి తక్కువ పాత్రల చుట్టూనే డ్రామా పండించడం ఈ సినిమాలోని ప్రధాన లోపాలు. కేశవ కథ, అతని ప్రమేయం ఈ మర్డర్‌లో ఎంత వరకూ ఉన్నాయి? అనేది ఆసక్తి కలిగిస్తుంటుంది. పతాక సన్నివేశాల్లో ఏదో బలమైన ట్విస్ట్ వస్తుందన్న ఆశ కలుగుతుంది. అలాంటి ట్విస్ట్ కూడా ఈ సినిమాలో ఉంది. అయితే.. ఆ ట్విస్ట్ కలిగించే థ్రిల్ అంతంత మాత్రమే. ఇది చాప్టర్ 1, చాప్టర్ 2 కూడా ఉంది కాబట్టి… అందులో ఇంకేమైనా షాకింగ్ విషయాలు ఉంటే ఉండొచ్చు. అయితే.. చాప్టర్ 2 కోసం చాప్టర్ 1కి సరైన న్యాయం చేయలేదనిపిస్తుంది. గంటా నలభై నిమిషాల్లో ముగిసిన కథ ఇది. రన్ టైమ్ విషయంలో మాత్రం దర్శకుడు చాలా షార్ప్‌గానే ఉన్నాడు. నిడివి తక్కువ కావడం, చెప్పదలచుకొన్న విషయంపైనే ఫోకస్ పెట్టడం అభినందించదగిన విషయం.
రుహానీ శర్మ సీరియస్ లుక్స్ లో ఆకట్టుకొంది. లేడీ ఓరియెంటెడ్ జోనర్స్లో సాధారణంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కనిపించవు. ఆ రకంగా చూస్తే దర్శకుడు కొత్త తరహా ప్రయత్నం చేసినట్టే అనుకోవాలి. రుహానీ నటన మరీ అద్భుతంగా, గుర్తు పెట్టుకొనే విధంగా లేకపోయినప్పటికీ.. డీసెంట్‌గా కనిపించింది. వికాస్‌ది ఓ రకంగా గెస్ట్ రోల్ అనుకోవాలి. లవ్ ట్రాక్ కి అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల ఆ పాత్ర కొన్ని సన్నివేశాలకే పరిమితమైంది. ఈ నగరానికి ఏమైంది ఫేమ్ జీవన్ కుమార్ తన నటనతో కాస్త రిలీఫ్ ఇచ్చాడు.
సాంకేతికంగా ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. బడ్జెట్ పరిమితులు ఉన్నా.. అవేం కనిపించకుండా సాంకేతిక నిపుణులు కష్టపడ్డారు. నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ బాగున్నాయి. మాటల్లో నాటకీయత చాలా తక్కువ. సహజంగా అనిపించాయి. దర్శకుడు ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని క్లాసీ టచ్‌తో అందించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ లో కొత్తదనం లేదు. సీట్ ఎడ్జ్ ఫీలింగ్ ఇవ్వలేదు. సినిమా చూస్తున్నంత సేపూ… `ఓకే` అనిపిస్తుంది తప్ప, బయటకు వచ్చాక కూడా గుర్తు పెట్టుకొని, దాని గురించి మాట్లాడుకొనేంత ఎఫెక్ట్ ఇవ్వలేకపోయాడు. టైమ్ పాస్ కోసమైతే… ఓసారి లుక్ వేయ్యొచ్చు.