భారతీయ జనతా పార్టీ నేతలు.. కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన రాజకీయం చేస్తున్నారు. ఢిల్లీలో ఆ పార్టీ అగ్రనేతలు.. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ గెలవడం తమకు ముఖ్యం కాదని… చంద్రబాబును ఓడించడమేనని ప్రకటనలు చేస్తూంటారు. పార్టీలు, సామాజిక శక్తులను దాని కోసం ఏకం చేస్తున్నామని చెబుతూంటారు. కానీ ఇక్కడి నేతలు మాత్రం .. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వాటికి తమకూ ఏం సంబంధం లేదని చెబుతూంటారు. వైసీపీ, జనసేనలతో బీజేపీ గేమ్ ఆడిస్తోందని.. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని… దానికి ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విజయవాడలో సమావేశమైన బీజేపీ నేతలు..మీడియా ఎదుట ఇదే వాదన వినిపించారు. తమపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి రాజకీయ ఒప్పందాలు లేకపోతే… ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు ఇలా ఎందుకుంటాయో… బీజేపీ నేతలు చెప్పగలరా..?. ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని అటు జగన్ కానీ.. ఇటు పవన్ కానీ.. పల్లెత్తు మాట అనకుండా.. కేవలం తెలుగుదేశం పార్టీని మాత్రమే టార్గెట్ చేయడానికి కారణమేమిటో విశ్లేషించగలరా..?. బీజేపీని ఉత్తరాది పార్టీ అని ఈసడించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు మోదీ తనకు సన్నిహితుడని.. చెప్పుకోవడానికి ఎందుకు సంకోచింతడం లేదో వివరించగలరా..? . అంతెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి ఒప్పందాలు లేకపోతే.. ఆ పార్టీకి చెందిన ఎంపీల రాజీనామాలపై.. ఇన్ని డ్రామాలు ఎందుకు ఆడుతున్నారో చెప్పగలరా..?. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏళ్ల తరబడి లభించని ప్రధానమంత్రి అపాయింట్మెంట్లు… విజయసాయిరెడ్డి, లక్ష్మిపార్వతి, కొత్తపల్లి గీత లాంటి వాళ్లకు.. అడగగానే ఎలా వస్తున్నారో చెప్పగలరా…?
ఓ వైపు ప్రత్యేకహోదా సాధ్యం కాదని.. మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని బుజ్జగించి.. ప్రత్యేకహోదాకు అంగీకరించేలా చేశారు. ఆ హోదాకు సంబంధించి ఒక్కరూపాయి నిధులు ఇవ్వకుండా.. అదే సమయంలో… హోదా సెంటిమెంట్‌ను ప్రజల్లో రెచ్చగొట్టేలా… వైసీపీ, జనసేనలను ప్రొత్సహించారనేది టీడీపీ ఆరోపణ. దీనికి తగ్గట్లుగానే ఇప్పుడు ఆ రెండు పార్టీల నేతలు… చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకున్నారని ప్రచారం చేస్తున్నారు కానీ…ప్రత్యేకహోదా ఇవ్వని కేంద్రాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు.
నోటికి వచ్చినట్లుగా అవినీతి ఆరోపణలు చేసే జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దానికి ఏమిటి ఆధారాలు అంటే.. అవినీతికి రసీదులు ఉంటాయా ఏమిటి.. అని ప్రశ్నిస్తూంటారు. పవన్ కల్యాణ్ యాంగిల్లోనే ఈ రాజకీయాన్ని కూడా చూసుకుంటే.. చీకటి రాజకీయ ఒప్పందాలకు కూడా రసీదులుండవు కదా..!. రాజకీయంగా ఆయా పార్టీల వ్యవహారశైలితోనే.. ఎవరేమిటో తెలిసిపోతుంది. అదే ప్రజల్లో మదిలో ఉండిపోయే సాక్ష్యం అంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు.