రాహుల్ గాంధీకి త్వరలోనే పట్టాభిషేకం జరగబోతున్నదట… ఇదేదో జోశ్యులు చెబుతున్నదికాదు. కాంగ్రెస్ నాయకుల మనోవాంఛ. అందుకుతగ్గట్టుగానే రాహుల్ కి శుభశకునాలు కనబడుతున్నాయట. అనుచరగణం చకచకా పావులు కదుపుతున్నారు. రాహుల్ ని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా ఎంచుకుంటే మరి సోనియాగాంధీ పరిస్థితేమిటన్న ప్రశ్నకు సరైన సమాధానాన్ని కూడా కాంగ్రెస్ పెద్దలు సిద్ధంచేసుకున్నట్లు తెలుస్తోంది.దేశంలో కాంగ్రెస్ మనుగడ అనే బృహత్తర బాధ్యతని రాహుల్ గాంధీ భుజస్కంధాలపై ఉంచబోతున్నారు. మరి ఏంచేస్తాడో ఈ యువకుడుకాని యువనేత…!!
రాజకీయంగా రాహుల్ ఇప్పుడు చిన్నపిల్లాడేమీకాదు. గతంలో తప్పులతడకగా సాగిన అతగాడి రాజకీయ నడత ఇప్పుడు సరైనదారిపట్టిందని పార్టీలోని సీనియర్లు అంటున్నమాట. బిహార్ ఎన్నికల ప్రచారసభల్లో రాహుల్ మాట్లాడిన తీరు, ప్రధాని నరేంద్రమోదీని దుయ్యబట్టిన పద్ధతి తమకు బాగా నచ్చేసిందని కాంగ్రెస్ వాదులు తప్పట్లుకొడుతున్నారు. బిహార్ ప్రచారం రాజకీయంగా సత్ఫలితాలను ఇచ్చిందన్నది వారి నమ్మకం. బిహార్ సభల్లో రాహుల్ ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని విరుచుకుపడ్డారు. `మోదీ నాయకునిగా పనికిరారనీ, కేవలం ఆయనో సెల్స్ మ్యాన్ మాత్రమే’ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు చాలామందిలో ఆలోచనలు రేకెత్తించినమాట కూడా నిజమే. దీనికి తోడు బిహార్ ఫలితాలు మోదీకి వ్యతిరేకం కావడం రాహుల్ కి అనుకోని అదృష్టమే అయింది.
అయితే రాహుల్ కి పగ్గాలు అప్పగించాలంటే పైన పేర్కొన్న కారణాలు సరిపోవని వాదించేవారూ సొంతపార్టీలోనే లేకపోలేదు. ఈ వ్యతిరేకత రాహుల్ కి పెద్ద హర్డిల్ కాబోదు. పైగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అందుకునేవారి పేరు చివర (తోకగా) గాంధీ అని ఉంటే చాలు, ఎవ్వరూ ఎలాంటి వంకపెట్టకపోవడం కాంగ్రెస్ నరనరాల్లోకి పాకిన సంస్కృతి. అందుకు భిన్నంగా ఆలోచించే సాహసం ఎవ్వరూ చేయరు.
రాహుల్ లో ఈమధ్య మార్పువచ్చింది. ప్రజలమధ్య ఎక్కువకాలం గడపడానికి ప్రయత్నిస్తున్నారు. దేశంలో ఎక్కడ ఏరకమైన వివాదం, లేదా తీవ్రస్థాయి సంఘటన జరిగినా `నేను మీకు అండగా ఉంటాను’ అంటూ వాలిపోతున్నారు. ఇది ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. రాహుల్ గాంధీ పార్టీ వర్గాల్లో వివాదరహితునిగా కూడా పేరుతెచ్చుకున్నారు. తల్లిచాటు బిడ్డ స్థాయి నుంచి పూర్తి రాజకీయ వ్యక్తిత్వం ఉన్నవానిగా గుర్తింపుపొందుతున్నాడు. వచ్చే రెండేళ్లలో పది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. 2016, 2017 సంవత్సరాలలో వివిధ రాష్ట్రాల్లో (అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవాల్లో) జరిగే ఎన్నికలు రాహుల్ రాజకీయ కెరీర్ కు అత్యంత కీలకమైనవే. ఇప్పటివరకు సొంతవ్యూహాలను అమలుచేయని రాహుల్ కు ఒకవేళ పూర్తి అధికారాలు కట్టబెడితే ఆయన ప్రయోగాత్మకంగా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే, ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారన్నదానిపై భిన్నాభిప్రాయాలు పార్టీలోనే వ్యక్తమవుతున్నమాట నిజమే. ఇప్పటికే పార్టీ చితికిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ప్రయోగాలు చేయడం మంచిదికాదన్న వాదన సీనియర్ల నుంచి గట్టిగానేవినబడుతోంది. రాహుల్ కి బదులుగా మరో యువనాయకునికి పట్టం గట్టవచ్చన్న ఆలోచన మాత్రం ఎవ్వరికీ రావడంలేదు. ఇది కాంగ్రెస్ పార్టీలో సాధ్యంకాదన్న సంగతి ప్రతిఒక్కరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీనే పార్టీకి ఉన్న ఏకైక యువనేత (వయసు ముదురుతున్నప్పటికీ). మరి అలాంటప్పుడు సోనియాగాంధీ ఎలాంటి బాధ్యతలను చేపడతారన్నది మరో ప్రశ్న.
సోనియా పరిస్థితి ఏమిటి?
కొడుకును అందలం ఎక్కించాలంటే సోనియాగాంధీ పార్టీ అధ్యక్షురాలి పదవినుంచి తప్పుకోవాలి. ఇప్పటికే ఉపాధ్యక్షహోదాలో ఉన్న కుమారుడ్ని అధ్యక్షస్థానంలో కూర్చోబెట్టడం ఆమెకు పెద్దకష్టమేమీకాదు. అయితే, ఒక్క బిహార్లో (మహాకూటమిలో చేరడం)తప్ప ఈమధ్య కాలంలో పార్టీకి గట్టిదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సానుకూలపరిస్థితి కోసం ఎదురుచూస్తున్న సోనియాకు, బిహార్ విజయంతో ఆ పరిస్థితి దరిచేరినట్లయింది. అందుకే ఆమె కూడా రాహుల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకే సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరి అలాంటప్పుడు సోనియా స్థానం ఏమిటి? భారతీయ జనతాపార్టీలో అద్వానీ వంటి కురువృద్ధులకోసం ప్రత్యేకంగా `మార్గదర్శక మండలి’ పేరిట ప్లాట్ ఫాం ఏర్పాటుచేసినట్లుగానే కాంగ్రెస్ లో కూడా పెద్దలకు సలహామండలిలో గౌరవస్థానాలను ఏర్పాటుచేయవచ్చు. ఇక్కడ బిజేపీ మంత్రాన్ని కాంగ్రెస్ కూడా అందిపుచ్చుకోవచ్చని భావిస్తున్నారు. రాహుల్ ఎప్పుడైనా పొరపాట్లు చేస్తే పార్టీ పెద్దలు సరిదిద్దడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది.
లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్ గా ఉన్న అమరిందర్ సింగ్ బాహాటంగానే రాహుల్ కు మద్దతు పలుకుతున్నారు. ఆయన సొంతరాష్ట్రమైన పంజాబ్ లో 2017లో ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి తమ పార్టీ, భావసారూప్యమున్న ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని బిహార్ లో మహాకూటమి విజయం సాధించినట్లుగానే పంజాబ్ లో ఘనవిజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీని బలోపేతంచేయడంలో ఇప్పటికే రాహుల్ సఫలీకృతమైనందున ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అమరిందర్ సింగ్ అభిప్రాయపడుతున్నారు. బిహార్ ఫార్ములా (మహాకూటమి ఏర్పాటు) ఫలప్రదం చేయడమే రాహుల్ విజయమని ఆయన కొనియాడారు. వీలైనంత త్వరలో రాహుల్ కి పూర్తి బాధ్యత అప్పగించాలని ఆయన కోరుతున్నారు.
ఈ వ్యవహారమంతా చూస్తుంటే రాహుల్ కి మంచిరోజులొచ్చినట్లే భావించాలి. సోనియాగాంధీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. అయితే ఈలోగా ఆమె తనకో గౌరవస్థానం క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చే జనరల్ ఎలెక్షన్స్ లో తమ పార్టీ విజయంసాధిస్తే, రాహుల్ ని ప్రధానిగా చేసి, తాను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అందుకోవచ్చన్న ఆలోచనకూడా సోనియాకు ఉన్నదని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం. మరి ఈ రాజకీయ సమీకరణలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచిచూద్దాం. ఎక్కడ ఏమాత్రం తప్పు జరిగినా పార్టీకి కోలుకోలేనంతగా నష్టం వాటిల్లుతుంది. పార్టీకి ఇదే ఆఖరి ప్రయోగం కావచ్చు. ఈ భయమే రాహుల్ పట్టాభిషేకానికి అతిపెద్ద అడ్డంకి.
– కణ్వస