తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం పెట్టింది. చర్చకు ఆమోదం లభించింది. అయినా ఆంధ్రప్రేదశ్ విభజన హామీల అంశం ఒక్కదానిపైనే చర్చ జరిగే అవకాశం లేదు. పార్టీల వారీగా బలాలను బట్టి.. సమయాన్ని స్పీకర్ కేటాయిస్తారు. ఆయా పార్టీలన్నీ.. తమ తమ రాష్ట్రాల్లోని అంశాలను ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కానీ అందరూ.. ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలను.. కచ్చితంగా ప్రస్తావించేలా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ తర్వాత అత్యధిక సమయం లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే… విభజన హామీల విషయంలో… బీజేపీ వైఖరిని ప్రశ్నిస్తోంది. ప్రత్యేకహోదా ఇవ్వాలన్న డిమాండ్ ను వినిపిస్తోంది. అవిశ్వాసంపై చర్చలో కాంగ్రెస్ ఈ డిమాండ్ ను కచ్చితంగా వినిపించే అవకాశం ఉంది. వినిపించకపోతే.. మాత్రం కాంగ్రెస్ చిత్తశుద్దిని ప్రశ్నించాల్సిందే..!
టీడీపీ అవిశ్వాస తీర్మానానికి సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, ఆప్, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, ఆర్జేడీ పార్టీ ఎంపీలందరూ… మద్దతుగా నిలబడ్డారు. ఈ పార్టీల నేతలందరితోనూ.. టీడీపీ ఎంపీలు ముందుగానే చర్చించారు. వీరందరూ… ఏపీ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్లను తమ ప్రసంగాల్లో వినిపించే అవకాశం ఉంది. నాలుగేళ్ల కాలంలో బీజేపీ పాలనా వైఫల్యాలను వీరు ఎండగట్టే అవకాశం ఉంది. ఏ విధంగా చూసినా.. ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం చేసిన అన్యాయాన్ని .. ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే కాకుండా.. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు కూడా.. దేశం ముందు ఉంచుతాయి. అది బీజేపీ విశ్వసనీయతకు చాలా ఇబ్బందికర పరిణామమే.
పార్లమెంట్ లో నాటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీకే విలువ లేదన్నట్లు వ్యవహరించడం… కచ్చితంగా బీజేపీ రాజకీయ విలువలకు ప్రశ్నార్థకం చేస్తుందన్న అభిప్రాయం ఉంది. ఇదొక్కటే కాదు.. నోట్ల రద్దు కష్టాలు, జీఎస్టీ పరిణామాలు సహా… దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో …జరుగుతున్న మతపరమైన దాడులు కూడా… లోక్సభలో విపక్షాలు ప్రస్తావించనున్నాయి. ఓ రకంగా చూస్తే.. బీజేపీ పాలనా వైఫల్యాలను బయటపెట్డడానికి..ఇదో అద్భుతమైన అవకాశంగా విపక్షాలు భావిస్తున్నాయి. అవిశ్వాస తీర్మానంతో…. జాతీయ రాజకీయాల్లోనూ ఓ స్పష్టత వచ్చినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు రాజకీయ పునరేకీకరణకు ఈ అవిశ్వాసం మార్గం సుగమం చేసినట్లయిందన్న భావన రాజకీయవర్గాల్లో ఏర్పడింది