జనసేన అధినేత తన మాటలకు తగ్గట్లుగా సామాజిక న్యాయం చేస్తున్నారు. తమ సామాజికవర్గానికి పూర్తి న్యాయం చేస్తున్నారు. జనసేన పార్టీ ప్రారంభించిన దాదాపు ఐదేళ్ల తర్వాత తన పార్టీలో ఓ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ “పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ”ని నియమిచారు. ఈ రోజంతా విజయవాడలో అద్దెకు తీసుకున్న ఇంట్లో… పార్టీకి కనీసం ఓ లేయర్ వ్యవస్థనైనా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో సుదీర్ఘంగా కసరత్తు చేసి.. తను చైర్మన్ గా.. మాదాసు గంగాధరం కన్వీనర్ మరో మగ్గుర్ని సభ్యులుగా నియమించి.. పీఏసీని ఏర్పాటు చేశారు. తోట చంద్రశేఖర్, మారిశెట్టి రాఘవయ్య, ఆష్రం యూసఫ్ మిగతా ముగ్గురు. వీరిలో ఒక్క యూసుఫ్ మినహా నలుగురూ… ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. ఇక ఆ తర్వాత పొలిటికల్ సెక్రటరీగా ప్రస్తుతం… మీడియా అడ్వైజర్ గా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ ను నియమించారు. ఆయన కూడా అదే సామాజికవర్గం. ఈ విధంగా.. పవన్ కల్యాణ్ తమ సామాజికవర్గానికి ఉన్నత స్థాయిలో సంపూర్ణ న్యాయం చేశారు.
స్టేట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినెటర్స్ గా పదిహేను మందిని , స్టేట్ బూత్ కోఆర్డినేటర్లుగా ఐదుగుర్ని, జనసేన లీగర్ కమిటీ చైర్మన్ గా కె. చిదంబరం అనే వ్యక్తిని నియమించారు. వీరందరిలోనూ ఒకే ముస్లిం పేరు కనిపించింది. ఒకరిద్దరు బీసే నేతలున్నారు. కానీ ఇతర సామాజికవర్గాలకు అవకాశం దక్కలేదు. ఇక కొత్త అధికార ప్రతినిధిగా.. సీనియర్ జర్నలిస్ట్ విజయబాబును నియమించారు. ఈయన గతంలో సమాచార శాఖ కమిషనర్ గా కూడా పని చేశారు. ఈయన కూడా పవన్ న్యాయం చేసే సామాజికవర్గానికి చెందిన వారే.
తనకు కులం లేదని చాలా ఆవేశంగా ప్రకటించే పవన్ కల్యాణ్.. అధికారం ఒక్కరిదేనా అని బిగ్గరగా అరుస్తూంటారు. అధికారం అందరిదీ అని నినదిస్తూంటారు. కానీ ఆచరణలో మాత్రం.. తన జనసేన కమిటీల్లోనే న్యాయం చేయలేకపోయారు. ఓ పార్టీ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థలో… అందరికీ ప్రాతినిధ్యం కల్పించడం ఆనవాయితీ. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఐదుగురిలో నలుగుర్ని ఒకే సామాజికవర్గం వారికి చోటు కల్పించారు. ఈ కమిటీలు చూసిన తర్వాత జనసేన కోసం ఇంత వరకూ పని చేసిన వారు నిరాశకు గురయ్యారు. కులం గోడలను పవన్ కల్యాణ్ బద్దలు కొట్టేస్తారని… నమ్మితే… తన వర్గానికే సామాజిక న్యాయం చేసే యజ్ఞాన్ని ప్రారంభించారని ఊసూరుమంటున్నారు. పదవిలో నియమించే ముందు కులాలు చూడనని పవన్ చెప్పుకోవడం బాగుంటుంది కానీ.. రాజకీయాలు మాత్రం కచ్చితంగా చూస్తాయి. ఆ విషయం పవన్ కల్యాణ్ తెలుసుకుంటారో లేదో మరి..!