కార్లు మార్చినట్లు పెళ్లాలని మారుస్తారని.. పవన్ కల్యాణ్ పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం సంచలనం రేపుతోంది. పైగా ఇటీవలి కాలంలో… ఇద్దరి మధ్య కాస్త స్నేహసంబంధాలు మెరుగుపడుతున్నాయనుకున్న సమయంలో జగన్ ఇలా స్పందించడం ఆ పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్య పరిచింది.
ఒక్కసారిగా జగన్ ఇలా కంట్రోల్ తప్పిపోవడం వెనుక కారణాలేమిటన్నదానిపై..ఆ పార్టీ నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. తను పిలుపునిచ్చిన బంద్ కు .. ఏ మాత్రం స్పందన లేకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్ కు గురై ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. బంద్ సక్రమంగా జరగకపోవడంతో.. ఉదయం నుంచి నేతలపై… జగన్మోహన్ రెడ్డి.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనికి తోడు.. ప్రెస్మీట్ ముగిసిన తర్వాత మీడియా ప్రతినిధులు.. పవన్ కల్యాణ్ చేసిన విమర్శలనే ప్రధానంగా ప్రస్తావించారు.
తనకు పది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే.. జగన్ లా పారిపోయేవాడిని కాదన్న పవన్ విమర్శలు కూడా.. జగన్ కు సూటిగా గుచ్చుకున్నట్లున్నాయి. ఎందుకంటే.. కొద్ది రోజులుగా.. వైఎస్ జగన్ నిర్ణయాలు సెల్ఫ్ గోల్స్ గా ప్రచారం పొందుతున్నాయి. అసెంబ్లీకి వెళ్లకపోవడం.. పార్లమెంట్ కు ఎంపీలతో రాజీనామాలు చేయించడంతో… అవిశ్వాస తీర్మానం గురించి జరిగిన చర్చలో పాల్గొనే అవకాశాన్ని వైసీపీ ఎంపీలు కోల్పోయారు. అప్పుడే… జగన్మోహన్ రెడ్డి.. ఎంపీల రాజీనామాలతో అతి పెద్ద సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తన నిర్ణయంపై పవన్ కూడా.. విమర్శలు చేయడంతో… జగన్… కంట్రోల్ తప్పిపోయారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. కానీ ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి..ఏదైనా బావిలో దూకమని.. వివాదాస్పదంగా మాట్లాడేవారు. నంద్యాల ఉపఎన్నికల్లో… నిలబెట్టి కాల్చినా తప్పులేదని.. విమర్శించారు. ఇలాంటి వాటిపై ఎప్పటికప్పుడు విమర్శలు వచ్చినా.. జగన్ లైట్ తీసుకుంటారు. ఈ సారి పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇలా పెళ్లిళ్లు చేసుకునేవాళ్లని నిత్యపెళ్లికొడుకని చెప్పి.. జైల్లో వేసేవారంటూ.. చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. ఎవరైనా తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తే అసలు సహించరు. గతంలో తన పెళ్లిళ్లపై విమర్శలు వచ్చినప్పుడు… తన గురించి మాట్లాడితే..అందరి జాతకాలు బయటకు తీస్తానని హెచ్చరికలు జారీ చేశారు. తనతో విడిపోయిన వారు ఎవరి బతుకు వారి బతుకుతున్నారని.. ఎందుకు బయటకు లాగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నేరుగా.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే… పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై అత్యంత అసభ్యకరంగా.. విమర్శలు చేయడంతో.. పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారోనన్న ఉత్కంఠ రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది.