ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో 800మంది స్కూల్ విద్యార్థులు, 60మంది ఉపాధ్యాయులతో ఏర్పాటైన ఇష్టాగోష్టిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 800మంది విద్యార్థుల్లో కొంతమంది మాత్రమే మోదీని ప్రశ్నించే అవకాశం వచ్చింది. నిజామాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక విద్యార్థినికి కూడా మోదీని ప్రశ్నించే ఛాన్స్ వచ్చింది. ఆ విద్యార్థిని అడిగిన ప్రశ్న…
`మీపై అత్యధికంగా ప్రభావం చూపినవారెవరు?’
దీనికి మోదీ ఇచ్చిన సమాధానం…
`మన మనసు గ్రహించే స్థితిలోఉంటే, అనేక విషయాలను గ్రహించవచ్చు. ఆ విషయంలో నేను నా ఉపాధ్యాయులందర్నీ ఇష్టపడతాను. అలాగే మా అమ్మగారిని కూడా. ఆమె నాపై చాలానే ప్రభావం చూపారు. స్వామి వివేకానందులవారి పుస్తకాలు అనేకం చదివాను. నాపై వాటి ప్రభావం కూడా ఉంది’
టీచర్స్ డే సందర్బంగా విద్యార్థుల ఇష్టాగోష్టిలో నరేంద్రమోదీ పాల్గొనడం ఇది రెండోసారి. క్రిందటిఏడాది కూడా ఆయన ఇలాగే విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
డ్రెస్ డిజైనర్ ఎవరు ?
ఢిల్లీ జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థి ఒకరు మోదీ డ్రెస్ పై ప్రశ్నించాడు. `మీరు డ్రెస్ వేసుకోవడంలో ప్రత్యేకత చూపిస్తుంటారు. మీరువేసుకునే కుర్తా, మోదీకుర్తాగా ఫేమస్ పొందింది. మీకెవరైనా డ్రెస్ డిజైనర్ ఉన్నారా?’
`చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకు ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారని. ఈ హాఫ్ స్లీవ్ కుర్తా వేసుకోవాలని నాకునేనే అనుకున్నాను. ఇలా వేసుకుంటే నాకు హాయిగా ఉంటుంది. ఇందులో ఫ్యాషన్ డిజైనర్ ప్రసక్తేలేదు’
బహుశా ఈ కుర్రాడు వేరే ఉద్దేశంతో అడిగిఉండవచ్చు. అమెరికా అధ్యక్షుడు ఒబామా వచ్చినప్పుడు మోదీ వేసుకున్న సూటు, దానిపై నరేంద్రమోదీ అన్న చిన్న అక్షరాలు ఉండటం వంటి అంశాలను గుర్తుతెచ్చుకుంటూ విద్యార్థి ఈ ప్రశ్న సంధించిఉండవచ్చు. కానీ మోదీ చాలా తెలివిగా తన షార్ట్ కుర్తా గురించి చెప్పుకొచ్చారు. ఈ ఇష్టాగోష్టిలో మోదీ షార్ట్ కుర్తానే వేసుకుని వచ్చారు.
పొట్టిచేతుల కుర్తా కథ
అక్కడితో ఆగకుండా మోదీ తన చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకుంటూ పొడుగుచేతుల కుర్తా కాస్తా పొట్టిచేతుల కుర్తాగా ఎలా మారిందన్న విషయంపై కథ చెప్పారు.
`నేను చిన్నతనంలోనే బట్టలు స్వయంగా ఉతుక్కునేవాణ్ణి. పొడుగుచేతుల కుర్తా ఉతుక్కోవడానికి చాలా సమయంపట్టేది. ఇక లాభంలేదని పొడుగుచేతులు కత్తిరించేశాను. దీంతో నాపని సులువైంది. అప్పటినుంచి పొట్టిచేతుల షర్ట్స్ వేసుకోవడం మొదలుపెట్టాను ‘ అని చెప్పగానే పిల్లలు హాయిగా నవ్వుకున్నారు. బహుశా, పిల్లల్ని నవ్వించడానికే ఆయన ఈ కథ చెప్పిఉంటారు. ఆ తర్వాత మరో విషయం చెప్పారు, గుజరాత్ లో వేడివాతావరణం ఎక్కవని, అందుకే తాను హాయిగా ఉంటుందనే ఇలా పొట్టిచేతుల కుర్తాలనే వేసుకోవడం అలవాటైందని సహేతుకంగా వివరణ ఇచ్చారు.
ఇస్తీ ఇలా పెట్టాను
చిన్నప్పుడు బట్టలకు ఇస్త్రీ ఎలా పెట్టుకున్నారో కూడా పిల్లలకు కథలాగా చెప్పారు మోదీ. కాలిన బొగ్గులను ఒక సత్తులోటాలో వేసుకుని ఇస్త్రీ పెట్టుకునేవాడినని చెప్పారు. అంతేకాదు, తన కాన్వాస్ బూట్లకు తెల్లటి పాలిష్ ఎలా పెట్టుకున్నారో కూడా వివరించారు ప్రధానిమోది. స్కూల్లో మాస్టారు పాఠం చెబుతున్నప్పుడు చాక్ పీసు ముక్కలు పక్కన పడుతుండేవి. వాటిని తాను ఏరుకుని కాన్వాస్ షూలపై రుద్దితే అవి వైట్ పెయింట్ వేసినట్టు మెరిసిపోయేవని చెబుతూ మోదీ ఫక్కున నవ్వారు. విద్యార్థులు కేవలం రోబోలుగా ఉండిపోకూడదనీ, వారిలోని సామర్థ్యాన్ని వెలికితీయడంకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ని ఏర్పాటుచేసిందని మోదీ తెలియజేశారు.
మొత్తానికి పిల్లలు ఎంత తెలివిగా ప్రశ్నలు అడిగినా మోదీ వారికి దొరక్కుండా కథలూ, కాకరకాయలు చెప్పి తప్పించుకున్నారు. దటీజ్ మోదీ.
– కణ్వస