గౌతమిపుత్ర శాతకర్ణి తరవాత క్రిష్ ఎవరితో సినిమా చేస్తాడన్న విషయంలో ఇప్పటి వరకూ ఓ క్లారిటీ రాలేదు. వెంకటేష్‌తో ఓ సినిమా అనుకోవడం… అది దాదాపుగా ఖాయం అవ్వడం.. అనుకోకుండా ఆ సినిమా ఆగిపోవడం తెలిసిన విషయాలే. అయితే ఆ సినిమా ఆగిపోవడానికి గల కారణం ఇప్పుడు బయటకు వచ్చింది. వెంకీ కోసం క్రిష్ ఓ నవలని సినిమాగా తీద్దామని భావించాడట. ఆ నవల పేరు… ‘అతడు అడవిని జయించాడు’. తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించిన నవల ఇది. కేశవరెడ్డి రచించిన ఈ పుస్తకానికి పలు పురస్కారాలు వరించాయి. ఇందులో సినిమాటిక్ పాయింట్ ఏదో… క్రిష్‌ని ఆకర్షించింది. నవలని యధాతధంగా తీయకపోయినా.. అందులోంచి కీలకమైన పాయింట్‌ని కథగా విస్కరించి వెంకీతో సినిమా చేద్దామనుకొన్నాడు క్రిష్.
అయితే… సరిగ్గా అదే సమయంలో దూలం సత్యనారాయణ అనే ఓ ఔత్సాహిక యువకుడు అతడు అడవిని జయించాడు పుస్తకం రైట్స్ సంపాదించి, దాన్ని సినిమాగా తీయాలని సంకల్పించాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా బయటకు వచ్చింది. ఆ పుస్తకంలోని పాయింట్ మాత్రమే తీసుకొన్నా సరే.. మొత్తం రైట్స్‌ని కొనుకోలు చేయాలని క్రిష్ భావించాడు. అతని కంటే ముందు దూలం సత్యనారాయణ ఆ రైట్స్‌ని సొంతం చేసుకోవడంతో.. క్రిష్ – వెంకీల సినిమా పక్కన పెట్టాల్సివచ్చింది. దూలం సత్యనారాయణ కాస్త ముందు చూపుతో వ్యవహరించి, తక్కువ రేటుకే… నవల రైట్స్‌ని సంపాదించాడని, లేదంటే.. వెంకీ – క్రిష్‌ల సినిమా మొదలైపోయేదని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెప్పుకొంటున్నాయి. రైట్స్ లేకుండా సినిమా మొదలెట్టేద్దాం అని సురేష్ బాబు చెప్పినా.. అది భావ్యం కాదని, ఆ తరవాత కాపీ రైట్స్ అంటూ లేని పోని వివాదంలో ఇరుక్కోవడం ఇష్టం లేదని క్రిష్ సున్నితంగా వారించినట్టు తెలుస్తోంది.