ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు చల్లటి మజ్జిగా అందించాలని నిర్ణయించుకోగానే, వైకాపా నేతలు అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ పాల సరఫరా సంస్థకి లబ్ది చేకూర్చడానికేనని వాదించడం మొదలుపెట్టారు. అగ్నికి ఆజ్యం తోడయినట్లు వారికి వారి సాక్షి మీడియా కూడా తోడయింది. వారి వాదనలను నిజం చేస్తున్నట్లుగా, విజయనగరం జిల్లా కలెక్టర్ జిల్లాలో గల హెరిటేజ్ డెయిరీ నుంచి పెరుగుకొనాలని లిఖిత పూర్వకంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఇంకేముంది ఆ ఆదేశాల కాపీని సాక్షి మీడియాలో ప్రముఖంగా ప్రచురించి తమ ఆరోపణలు నిజమేనని వైకాపా మరోమారు గట్టిగా వాదించింది. ఆ దెబ్బకి కలెక్టర్ ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకొని మళ్ళీ తాజాగా మరో ఉత్తర్వులను జారీ చేయవలసి వచ్చింది. హెరిటేజ్ సంస్థ నుంచి మాత్రమే పెరుగు, మజ్జిగ కొనమని తనకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు రాలేదని, విశాఖ డెయిరీ సంస్థ కేవలం విజయనగరం పట్టణంలో మాత్రమే సరఫరా చేయగలమని చెప్పడంతో సమీపంలో ఉన్న హెరిటేజ్ డెయిరీ నుంచి పెరుగు తీసుకొన్నామని దానిని రాజకీయం చేయవద్దని కలెక్టర్ కోరారు. జిల్లాలో గల విశాఖ, హెరిటేజ్, తిరుమల, జెర్సీ సంస్థలతో పాటు ఇతర కో-ఆపరేటివ్ మరియు వాణిజ్య సంస్థల నుంచి కూడా ఇదివరకు ప్రకటించిన ధరకే పెరుగు కొనుగోలు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసారు. ఇటువంటి నిర్ణయాలే ప్రజల దృష్టిలో ప్రభుత్వాన్ని పలుచన చేస్తుంటాయని గుర్తుంచుకొంటే మంచిది. చంద్రబాబు నాయుడు ప్రజలకు హెరిటేజ్ మజ్జిగ త్రాగిద్దామనుకొంటే సాక్షి, వైకాపా కలిసి ఆయనకే విశాఖ మజ్జిగ త్రాగించినట్లయింది.