హెరిటేజ్ సంస్థ రూ. నలభై కోట్ల విలువైన మజ్జిగ ప్యాకెట్లు ప్రభుత్వానికి సరఫరా చేసిందని.. దానిపై సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని ఏపీ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై హెరిటేజ్ సంస్థ స్పందించింది. ప్రభుత్వం చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టం చేస్తూ.. వివిధ సందర్భాల్లో తాము టెండర్లలో పాల్గొని దక్కించుకున్న సరఫరా కాంట్రాక్టుల వివరాలను బహిర్గతం చేసింది. తెలుగుదేశం హయాంలో ఐదేళ్ల కాలంలో.. తాము ప్రభుత్వానికి సరఫరా చేసిన మజ్జిగ విలువ రూ.కోటి 49 లక్షలు మాత్రమేనని హెరిటేజ్ స్పష్టం చేసింది. అదే సమయంలో ఆన్ లైన్లో టెండర్లలో పాల్గొని.. వివధ పండుగల సందర్భంగా సరఫరా కాంట్రాక్టు పొందిన మొత్తం విలువ రూ.21కోట్ల 19 లక్షలు మాత్రమేనని స్పష్టం చేసింది.
అది కూడా.. 2014-15 నుంచి 2016-17 వరకేనని తెలిపింది. ఆ తర్వాత ఎలాంటి టెండర్లలో పాల్గొన్నట్లు.. ప్రభుత్వానికి నెయ్యి సరఫరా చేసినట్లుగా కంపెనీ చెప్పలేదు. నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కూడా.. నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్లో.. దక్కించుకున్నామని… ఎప్పుడూ కూడా హెరిటేజ్‌కు సింగిల్ టెండర్ దక్కలేదని.. ఇతర కంపెనీలతో కలిసి మాత్రమే సప్లయ్ చేశామని… హెరిటేజ్ సంస్థ విడుదల చేసిన అధికారిక వివరణ పత్రంలో స్పష్టం చేసింది. హెరిటేజ్ అత్యున్నతమైన కార్పొరేట్ విలువలు.. నైతిక ప్రమాణాలు పాటిస్తుందని… కంపెనీ స్పష్టం చేసింది. ప్రతి ప్రక్రియ నిష్పాక్షిపాతంగా జరిగిందని.. హెరిటేజ్ తెలిపింది.
రైతుల ఉత్పత్తిని మార్కెటింగ్ చేస్తూ.. రైతులకు సంస్థ ఉపయోగపడిందని.. సంస్థపై అనవసర నిందలు మోపే ముందు లక్షల మంది రైతుల జీవనాధారాన్ని కలవర పెడుతున్నారని గ్రహించాలని హెరిటేజ్ యాజమాన్యం హితవు పలికింది. హెరిటేజ్ రాజధానిలో భూములు కొనిందంటూ.. గతంలోనూ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అయితే.. రాజధానికి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో మిల్క్ ప్లాంట్ కోసం కొన్నామని ఆరోపణలు చేసినప్పుడు.. ఇలాంటి వివరణ లేఖను గతంలో హెరిటేజ్ విడుదల చేసింది. ఇప్పుడు రెండో సారి మజ్జిగ ఆరోపణలతో వాస్తవాల పేరుతో లేఖను విడుదల చేసింది.