కోపాలు, ఈగోలూ అందరికీ ఉంటాయి. సెలబ్రెటీలేం అందుకు అతీతం కాదు. కానీ కెమెరా ముందుకొచ్చేసరికి వాటిని దాచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఓ హోదాలో ఉన్నారు కదా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ… తన ఎమోషన్స్‌ని చూపించుకోరు. అదేదో సినిమాలో ఎమ్మెస్ నారాయణలా.. `కంట్రోల్.. కంట్రోల్..` అంటూ సర్దుకుపోవాల్సిందే. అయితే కొన్నిసార్లు మాత్రం హీరోలు.. వాటిని అదుపులో ఉంచుకోలేక, దొరికిపోతుంటారు. ఇలా ఓ హీరో… అన్నపూర్ణ స్టూడియోలో తన కోపాన్నీ, ఆవేశాన్నీ కక్కేశాడు. అయితే ఇది ఇప్పటి మాట కాదు. నాలుగైదేళ్ల క్రితం విషయం.
ఓ హీరోగారు… హైదరాబాద్ లోని స్టూడియో కి షూటింగ్ నిమిత్తం వచ్చారు. షూటింగ్ అయిపోయింది. తన కార్లో, తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం ఆయనకు అలవాటు. అలా కారు తీశారు. కానీ… ఎదురుగా మరో కారు అడ్డుంది. ఎన్నిసార్లు హారన్ కొట్టినా, ఆ కారు తాలుకూ డ్రైవర్ రాలేదు. హారన్ కొట్టీ, కొట్టీ… ఇక విసుగెత్తి…చాలా దూరం ఆ కారుని గుద్దుకుంటూ తీసుకెళ్లిపోయాడట. చుట్టూ… సిబ్బంది ఉన్నా, ఎవ్వరూ పల్లెత్తు మాట కూడా అనలేదు. ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అసలే ఆ హీరోకి కోపం ఎక్కువ అని బయట టాకు. పైగా వీరావేశంతో ఉన్నాడు. అలా కారుని గుద్దేసే సరికి.. రెండు కార్లూ బాగా డామేజీ అయ్యాయి. హీరోగారి కారు కూడా ఆగిపోయింది. కారులోంచి ఒక్కసారిగా బయటకు దిగి.. ‘ప్రొడక్షన్ మేనేజర్.. కారు తీసుకురా..’ అంటూ గట్టిగా అరిచేసరికి… హడావుడిగా మరో కారు తీసుకొచ్చి, అందులో హీరోగారిని ఇంటి వరకూ దిగబెట్టాల్సివచ్చింది.
ఇక్కడ ట్విస్టేమిటంటే… ఆ డామేజ్ అయిన కారు… మరో హీరోది. తన సహచర కథానాయకుడికి కోపం వచ్చి, నా కారుని డామేజ్ చేశాడని తెలిసి ఏం కంగారు పడలేదు. డామేజ్ అయిన రెండు కార్లనీ షెడ్డుకి పంపించి.. రిపేర్లు చేయించి, ఆ కారుని భద్రంగా ఆ హీరో ఇంటికి పంపాడట. ఈ టోటల్ ఎపిసోడ్ లో ఓ హీరోలో కోపం కనిపించింది. మరో హీరోలో `సర్దుకుపోవడం` అనే లక్షణం కనిపించింది. ఇంత జరిగినా… ఆ హీరో.. ఈ హీరోకి ‘సారీ’ కూడా చెప్పలేదట. ఇదీ ఆ కారు ఎపిసోడ్. ఇప్పటికీ ఆ హీరో గారి కారు.. స్టూడియోలోకి ఎంట్రీ ఇస్తే.. సిబ్బంది కంగారు పడిపోతార్ట. అంత భయపెట్టేశాడు ఆ హీరో.