సినిమా అంటేనే హీరోల రాజ్యం. హీరోల్ని సెట్లో, బయటా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వాళ్ల అడుగులకు మడుగులు ఎత్తాలి. లేదంటే వాళ్లకు కోపాలు వచ్చేస్తాయి. షూటింగులు క్యాన్సిల్ అయిపోతాయి. అలాంటిదే.. జరిగింది. అదో పెద్ద సినిమా. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ల కాంబో! సెట్లో కనీసం 200 మంది ఉన్నారు. అయితే హీరో సడన్‌గా షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్లిపోయాడు. కారణం.. మినరల్ వాటర్ లేదని. తాగడానికి కాదు.. ఈదడానికి!
అండర్ వాటర్‌లో ఓ ఫైట్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశాడు దర్శకుడు. ఫైట్ మాస్టర్ అన్నీ సిద్దం చేశాడు. ఓ పెద్ద కొలను లాంటి ప్రదేశంలో నీటిని నింపేశారు. ‘అది మినరల్ వాటర్ కాదని, ట్యాంకర్లతో తెప్పించిన నీర’ని హీరోకి అర్థమైంది. వెంటనే ‘పేకప్’ చెప్పి వెళ్లిపోయాడు. దర్శకుడికి హీరో బాధ అర్థమై.. మరుసటి రోజు కొలనుని మినరల్ వాటర్‌తో నింపేశాడు. అయితే ట్విస్టేంటంటే… ఆ రోజూ షూటింగ్ జరగలేదు. కారణం.. ఈ కొలను చుట్టూ కొన్ని చెట్లు ఉన్నాయి. వాటి ఆకులు రాలి పడ్డాయట. అదంతా శుభ్రం చేసి, మళ్లీ ఫ్రెషుగా నీరు నింపండని హీరోగారు ఆదేశాలిచ్చారు. హీరోగారు చెప్పిన మాట జవ దాటితే ఇంకేమైనా ఉందా? అందుకే మళ్లీ మినరల్ వాటర్ తో మళ్లీ ఫ్రెష్షుగా ఆ కొలను నింపేశారు. అప్పుడు హీరోగారు ఆ నీళ్లల్లో దిగి ఫైట్ చేశారు. సదరు మినరల్ వాటర్ కోసం, షూటింగ్ అర్థాంతరంగా నిలిపేయడం వల్ల ఈ సినిమాకి జరిగిన నష్టం అటూ ఇటుగా రూ.50 లక్షల వరకూ ఉంటుందని టాక్. బడ్జెట్లు పెరిగిపోతున్నాయంటే.. పెరగవు మరీ!?