పరిశ్రమలో చెప్పుకోదగిన స్థాయిలో ఉన్న హీరో అతను. మాస్, కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు. ఫ్లాపులున్నా సరే, చేతిలో బోలెడన్ని సినిమాలు. పారితోషికం కూడా భారీగా అందుతుంది. `నాకింత పారితోషికం కావాల్సిందే`అని పట్టుబట్టి మరీ వసూలు చేస్తుంటాడు. ఈ విషయంలో ఆ హీరోకి తిరుగులేదు. నిర్మాతల అవసరం కాబట్టి అడిగిందంతా ఇచ్చేస్తారు. ఓ హీరోకి ఇచ్చే పారితోషికంలో కొంత ఆపి, సినిమా పూర్తయ్యాకో, డబ్బింగు సమయంలోనో ఇవ్వడం.. ఓ ఆనవాయితీ. అయితే ఆ హీరో విషయంలో అదీ చెల్లదు. సగం సినిమా అయ్యేసరికి డబ్బులు మొత్తం ఇవ్వాల్సిందే. లేదంటే షూటింగ్ కి రాడు.
అక్కడితో అయిపోయిందా అంటే లేదు. సినిమా అంతా అయిపోతోందనగా, డబ్బింగ్ ముందు అలకపాన్పు ఎక్కడం అలవాటుగా చేసుకొన్నాడు. `హీరో గారు డబ్బింగ్ కి రావడం లేదేంటి?` అని నిర్మాత బిత్తర పోతే.. `ఫలానా విషయంలో హీరో అలిగాడు.. ఆయనకు ఇంకొంత పారితోషికం ఇచ్చి కూల్ చేయండి.` అంటూ కబురు అందుతుంది. మొన్నామధ్య ఓ సినిమా విషయంలో అదే జరిగింది. ఒప్పుకొన్న పారితోషికానికి అదనంగా మరో 2 కోట్లు ఇస్తే గానీ డబ్బింగ్ కి రానన్నాడట. అనుకొన్న సమయానికి సినిమా పూర్తి చేయడం తప్ప మరో మార్గం లేని నిర్మాత.. హీరో అలక తీర్చడానికి రెండు కోట్లు సమర్పించుకోవాల్సివచ్చింది. అది బాగా వర్కవుట్ అయ్యింది. అందుకే మరోసారి ఇదే ట్రిక్ ప్లే చేశాడు.
ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు. నిర్మాతలు రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. మరో పాట షూట్ చేయాల్సివుంది. దాంతో పాటు డబ్బింగ్ చెప్పాలి. తీరా చూస్తే హీరో మరోసారి అలిగాడు. `మొన్నామధ్య ఇలానే అలిగితే 2 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా అంతే ఇచ్చేయండి. పని అయిపోతుంద` అంటూ నిర్మాతకు కబురెళ్లింది. దాంతో నిర్మాత షాకైపోయాడు. ఇప్పటికే ఈ సినిమాపై చాలా పెట్టుబడి పెట్టాడు నిర్మాత. మరోవైపు బిజినెస్ అంతంతమాత్రంగానే జరుగుతోంది. ఇలాంటప్పుడు హీరో పారితోషికం తగ్గించుకోవాలి గానీ, ఇలా 2 కోట్లు అదనంగా ఇవ్వమనడం ఏమిటి? అంటూ తల పట్టుకుంటున్నాడు. ఇప్పటికైతే నిర్మాత 2 కోట్లు ఇవ్వలేదు. హీరో డబ్బింగూ చెప్పలేదు. ఏం జరుగుతుందో చూడాలి.