ఓ పెద్ద కుటుంబం నుంచి వచ్చిన హీరో అతను. ఇప్పటి వరకూ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. కానీ ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. పెద్ద దర్శకులు, పెద్ద బ్యానర్లు కలిసినా.. బాబుగారి కెరీర్ని ఓ కొలిక్కి తీసుకురాలేకపోతున్నారు. ఇప్పుడు కూడా ఓ పెద్ద సినిమా చేస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా స్థాయిలో. దర్శకుడు కూడా ప్రతిభావంతుడే. తన ఖాతాలో సూపర్ హిట్లు ఉన్నాయి. సినిమా తీయడంలో తనదంటూ ఓ ముద్ర ఉంది. ఓ సూపర్ హిట్ తీయాలన్న కసితో.. ఈ బాబుతో కలిసి సినిమా చేస్తున్నాడు.
అయితే బాబు మాత్రం దర్శకుడ్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడట. అసలే బాబు మొహంలో ఎక్స్ప్రెషన్స్ పలకడం కష్టం. అందుకే రీ టేకులు, వన్స్మోర్లు, రీషూట్లు అవసరం అవుతున్నాయి. ఇప్పటికే.. ఈ కథని అటూ ఇటూ మార్చి, చాలా రిపేర్లు చేశారు. సెట్లో కూడా బాబు తీరు వల్ల తీసిందే తీయడం జరుగుతోంది. అయితే ఇప్పుడు బాబులో అసహనం మొదలైందని, వన్ మోర్ అడిగితే.. సిబ్బందిపై కేకలు వేస్తున్నాడని, `చేసింది చాలు.. ఇంకా ఎక్కువ చేయడం నా వల్ల కాదు` అని దర్శకుడి మొహం మీదే చెప్పేస్తున్నాడని, దాంతో దర్శకుడికీ, హీరోకీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని సమాచారం. ఇప్పటికి సగం సినిమా కూడా పూర్తవ్వలేదు. మరో సగం సినిమా అయ్యేటప్పటికి ఇంకెన్ని వినాల్సివస్తుందో అని.. ఈ టీమ్ లోని వాళ్లంతా గుసగుసలాడుకుంటున్నారు.