ప్రధాని నరేంద్ర మోడీ ఆదర్శ్ సంసద్ గ్రామ యోజన అనే పధకాన్ని ప్రవేశపెట్టి పార్లమెంటు సభ్యులందరూ ఒకటి లేదా రెండు గ్రామాలను దత్తత తీసుకొని, కేంద్రప్రభుత్వం కేటాయిస్తున్న ఎంపీ లాడ్స్ ఫండ్స్ తో అభివృద్ధి చేయాలని కోరారు. అధికార, విపక్షాలకు చెందిన ఎంపీలు చాలా మంది స్పందించి అనేక గ్రామాలను దత్తత తీసుకొన్నారు. తరువాత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన మంత్రులను, ప్రజా ప్రతినిధులను రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలను, కార్పోరేట్ సంస్థలను గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయవలసిందిగా కోరారు.
ఆ తరువాత మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా కూడా గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం అనే పాయింటు చుట్టూ తిరగడంతో, స్వయంగా మహేష్ బాబు తెలంగాణాలో మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తూరు మండలంలో సిద్దాపురం గ్రామాన్ని దత్త తీసుకొంటున్నట్లు ప్రకటించారు. తెలంగాణా రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కె.తారక రామారావు ఈ సినిమాను చూసిన తరువాత అంత మంచి పాయింటుతో సినిమా చేసినందుకు మహేష్ బాబుకి ఫోన్ చేసి అభినందించిన తరువాత తెలంగాణాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమని కోరడంతో మహేష్ బాబు అందుకు అంగీకరించి సిద్దాపురం గ్రామాన్ని దత్తత తీసుకొన్నారు.
ఈ సినిమా ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నారు. చాలా సినిమాలలో సమాజానికి సందేశాలు ఇస్తుంటారు కానీ వాటిని ప్రజలు ఎన్నడూ పట్టించుకోలేదు. కానీ శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు ఇచ్చిన ఈ సందేశం మాత్రం అందరికీ బాగా కనెక్ట్ అవడం చాల సంతోషకరం. ఒక రాజకీయ నాయకుడో లేక రాజకీయ పార్టీయో లేకపోతే ప్రభుత్వం చెప్పిన దానికంటే ప్రజలలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో చెప్పిన మాట ఎక్కువ ప్రభావంతంగా ఉంటుందని దీని వలన స్పష్టం అవుతోంది. కనుక ఇటువంటి మంచి ఫలితం ఇస్తున్న ఈ సినిమాని హిందీతో సహా దేశంలో అన్ని ముఖమయిన బాషలలో రీమేక్ చేసినట్లయితే ఈ ఉద్యమం దేశవ్యాప్తం అవుతుంది. దేశంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకొంటాయి.