తెలుగు360 రేటింగ్: 2.25/5
ఈ సంక్రాంతికి విడుదలైన మూడు ప్రధానమైన సినిమాల్లోనూ వారసుల సందడే. ఇద్దరు వారసుల తొలి సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి… `హీరో`. కృష్ణ మనవడు, మహేష్ మేనల్లుడైన అశోక్ గల్లా ఈ చిత్రంతో పరిచయమయ్యారు. గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తనయుడే అశోక్ గల్లా. ప్రముఖ పారిశ్రామిక వేత్త కూడా అయిన జయదేవ్ ఇంటి నుంచి అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమాతోనే ఏర్పాటైంది. ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తించాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించడం కూడా సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. మరి చిత్రం సంగతేమిటో తెలుసుకునే ముందు కథలోకి వెళదాం..
సినిమా నేపథ్యంలో సాగే సినిమా ఇది. హీరో కావాలని కలలు గంటుంటాడు అర్జున్ (అశోక్ గల్లా). తండ్రి (నరేష్) వద్దని వారిస్తుంటాడు, తల్లేమో (అర్చన) ప్రోత్సహిస్తుంటుంది. ఇంతలో పక్కింట్లోకి దిగిన అమ్మాయి, వైద్యురాలైన సుబ్బు (నిధి అగర్వాల్) తో అర్జున్ ప్రేమలో పడతాడు. హీరో అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ కథ అడ్డం తిరుగుతుంది. ఎవరికో వెళ్లాల్సిన కొరియర్ అర్జున్ చేతికొస్తుంది. అందులో చూస్తేనేమో గన్ ఉంటుంది. దాని వెనకాలేమో ముంబై మాఫియా. ఆ గన్ అర్జున్‌కే ఎందుకు పంపారు? అది ఎన్ని తిప్పలు తెచ్చిపెట్టింది? ఆ గన్‌తో సుబ్బు తండ్రి జగపతిబాబుని చంపాలని చెబుతూ మరో కొరియర్ చేతికందాక హీరో ఏం చేశాడు? ఇంతకీ జగపతిబాబుకీ, మాఫియాకీ మధ్య సంబంధమేమిటి? తదితర విషయాలతో మిగతా సినిమా సాగుతుంది.
పూర్తిస్థాయిలో ఓ కథ రాసుకుని దాన్ని సినిమాకి తగినట్టుగా మలచడం వేరు. ఓ కాన్సెప్ట్ అనుకుని దాన్ని రెండు గంటలపాటు సాగే సినిమాగా మలచడం వేరు. ఇందులో శ్రీరామ్ ఆదిత్య రెండో రకమైన ప్రయత్నమే చేశాడు. దాంతో బలమైన పునాది లేని మేడలాగా, ఎంతవరకు వెళ్లాలో అంతవరకు వెళ్లి మధ్యలో కూలిపోయిందీ కథ. ప్రథమార్థం వేగంగా ఆసక్తికరంగా సాగే స్క్రీన్‌ప్లే, అవసరమైనప్పుడంతా పండే కామెడీతో ప్రథమార్థం చక్కటి వినోదాన్ని పంచుతుంది. ఆ తర్వాత చెప్పడానికి కథలో కొత్త పార్శ్వాలంటూ లేకపోవడంతో నిస్సారమైన కథనంతోనే మేజిక్ చేయాల్సి వచ్చింది. బలమైన కథ లేనప్పుడు ఒట్టి కథనంతో ఏం చేసినా అది సాగదీతే అవుతుంది తప్ప, దాన్నుంచి పెద్దగా ప్రయోజనం ఉండదు. ద్వితీయార్థంలో అదే జరిగింది. కాకపోతే హ్యూమర్ పండించే విషయంలో దర్శకుడు చేసిన ప్రయత్నం మాత్రం చివరివరకూ విజయవంతంగా సాగింది. కథలో నుంచే ఆ హ్యూమర్‌ని పుట్టించడం సినిమాకి కలిసొచ్చిన విషయం. కథతోపాటు చాలా లోపాల్ని బయటికి రానీకుండా చేసిన విషయం కూడా అదే. సినిమా హీరో కావాలంటూ కలలు గనే హీరో పాత్రతో మొదలయ్యే ఈ సినిమా వేగంగానే కథలోకి తీసుకెళుతుంది. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకథ మొదలు కావడం, ఆ వెంటనే గన్ చేతికి అందడం, దాంతో సీఐని కాల్చడం, ఆ తర్వాత అది హీరోయిన్ చేతికి వెళ్లడం… ఇలా కథ గన్తోపాటే పరుగులు పెడుతుంది. ద్వితీయార్థంలో కథ గ్రాఫ్ మొత్తం పడిపోతుంది. జగపతిబాబు పాత్ర ఫ్లాష్‌బ్యాక్ మరో కోణాన్ని ఆవిష్కరిస్తుందేమో అనుకుంటే, ఆ పాత్రని కూడా కామెడీగానే వాడుకున్నాడు దర్శకుడు.
అప్పటిదాకా సీరియస్‌గా కనిపించిన ముంబై మాఫియా నేపథ్యం కూడా ఆ ఎపిసోడ్‌తో సిల్లీగా అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో బ్రహ్మాజీ చేసిన హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. ఓ కొత్త రకమైన కథతో హీరో పరిచయ చిత్రాన్ని తెరకెక్కించిన విషయంలో మాత్రం శ్రీరామ్ ఆదిత్యకి మంచి మార్కులు పడతాయి.
అశోక్ గల్లాలో ఎనర్జీ ఆకట్టుకుంటుంది. డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశాడు. కామెడీ టైమింగ్ కూడా మెప్పిస్తుంది. లుక్స్ పరంగా పర్వాలేదనిపిస్తాడంతే. నిధి అగర్వాల్ అందంతో ఆకట్టుకుంది. ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. ముద్దు సన్నివేశాలతో కుర్రకారుని మురిపిస్తుంది. జగపతిబాబు, నరేష్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్య నవ్వించారు. క్లైమాక్స్‌లో సీనియర్ హీరో పాత్రలో బ్రహ్మాజీ చేసే హంగామా బాగా నవ్వించింది. సాంకేతిక విభాగాల్లో అన్నీ చక్కటి పనితీరుని కనబరిచాయి. ముఖ్యంగా కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఇద్దరు కెమెరామెన్లు ఈ సినిమాకి పనిచేసినా కలరింగ్‌లో ఏమాత్రం తేడా కనిపించదు. నిర్మాణం పరంగా రాజీ లేని ధోరణి సినిమాకి కలిసొచ్చింది. చాలా సన్నివేశాలు రిచ్‌గా కనిపిస్తాయి. ముఖ్యంగా రచ్చ రవి వెంట హీరో పడే సన్నివేశాల్ని తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. నేపథ్య సంగీతం అంతంత మాత్రమేఅయినా గిబ్రాన్ సమకూర్చిన రెండు పాటలు, చిత్రణ మెప్పిస్తాయి. హీరో డెబ్యూ సినిమా అంటే దర్శకులంతా ఓ ఫార్ములాతో ఆలోచిస్తుంటారు. రొటీన్ కథలతోనే పరిచయం చేస్తుంటారు. కానీ శ్రీరామ్ ఆదిత్య వైవిధ్యం ప్రదర్శించి తన ప్రత్యేకతని చాటారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
పండగపూట కాపేపు నవ్వుకుని కాలక్షేపం చేయాలనుకుంటే ఈ సినిమాని చూడొచ్చు. కథ పరంగా అద్భుతాలేమీ లేవు కానీ, కథనం పరంగా, నేపథ్యం పరంగా మంచి ప్రయత్నం అనిపించే సినిమా ఇది. ఈ హీరో మరిన్ని ప్రయత్నాలు చేయొచ్చు అనిపించేలా ఉంది అశోక్ స్క్రీన్ ప్రజెన్స్.
తెలుగు360 రేటింగ్: 2.25/5