సినిమాల భవితవ్యం హీరోల చేతుల్లో ఉంటే, హీరోలేమో మేనేజర్ల చేతుల్లో ఉంటారు. కొంతమంది హీరోల విజయాల్లో మేనేజర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. తమ హీరోలకు ఎలాంటి కథలు నప్పుతాయో, వాటినే అన్వేషించి, ఓపిగ్గా కథలు విని, అందులో మంచివి ఏరుకొని, హీరో ముందుకు తీసుకెళ్లడం, ప్రాజెక్టులు సెట్ చేయడం వీళ్ల పని.
ఓ హీరో కూడా అలానే ఓ అమ్మాయిని మేనేజర్‌గా నియమించుకొన్నాడు. ఆ హీరో కోసం కథలు వినడం, ప్రాజెక్టులు సెట్ చేయడం ఆమె పని. కానీ… సదరు మేనేజర్‌కు ఏ కథా నచ్చడం లేదు. దర్శకులు, నిర్మాతలు హీరోని కలవాలంటే ముందు ఆమెను ప్రసన్నం చేసుకోవాలి. ఆమెకంటూ ఓ కోటరీ ఉంది. తన సన్నిహితులు, స్నేహితుల కథల్ని హీరోకి వినిపించే ప్రయత్నం చేస్తోంది. ఆ కథలేమో హీరోకి నచ్చడం లేదు. ఆ హీరో పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. తొలి సినిమా హిట్టు. ఆ తరవాత అన్నీ ఫట్టుమన్నాయి. ఇలాంటి దశలో పారితోషికం గురించి పెద్దగా ఆలోచించకూడదు. ఓ మంచి ప్రాజెక్టు సెట్ అయితే చాలనుకోవాలి. కానీ అది కూడా జరగడం లేదు. పారితోషికం పేరు చెప్పి కూడా నిర్మాతల్ని భయపడేలా చేస్తోందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఆ హీరోఏమో ‘ఏదో ఓ ప్రాజెక్ట్ సెట్ చేయ్’ అంటుంటే ఈ మేనేజర్ ఏమో… ‘మంచి కథ రావాలి కదా’ అంటూ కాలక్షేపం చేస్తోంది. కాకపోతే ఇద్దరిదీ ‘బ్రో – సిస్టర్’ రిలేషన్. కాబట్టి.. ఆ హీరో కూడా పైకి ఏమీ అనలేక, అవస్థలు పడుతున్నాడని టాక్.