ప్రముఖ నటుడు రాజశేఖర్ కారు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డు దగ్గర కారు బోల్తా కొట్టింది. సమయానికి ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో రాజశేఖర్‌కి ప్రమాదం తప్పింది. ఎలాంటి గాయాలూ లేకుండానే ఆయన బయటపడ్డారు. కారు ముందు భాగం మాత్రం నుజ్జు నుజ్జు అయ్యింది. ఆ సమయంలో కారులో రాజశేఖర్ ఒక్కరే ఉన్నారు. స్థానికులు కారులో ఉన్న రాజశేఖర్‌ని గుర్తించి, వాళ్లు బయటకు లాగారు. వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకూ సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆ సమయంలో రాజశేఖర్ మద్యం సేవించారా?
సాధారణంగా ఓవర్ స్పీడు, మద్యం తాగి కారు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. పోలీసులు ఈ కోణంలోంచే కేసుని దర్యాప్తు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజశేఖర్ ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. పోలీసులు రాజశేఖర్ రక్త నమూనాలను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో పాటు సీసీ కెమెరా ఫుటేజీనీ సేకరిస్తున్నట్టు సమాచారం.