హీరో సాయి ధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దగా గాయాలు కాలేదు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఒక్క సారిగా షాక్‌కు గురి కావడంతో అపస్మారక స్థితికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ట్రీట్మెంట్ ప్రారంభమైన కాసేపటికే ఆయన స్పృహలోకి వచ్చారు. అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యలు చిన్నపాటి ఫ్రాక్చర్లను మాత్రమే గుర్తించారు. అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని అపోలో ఆస్పత్రి వైద్యులు మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తూండటం వల్ల పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది.
కేబుల్ బ్రిడ్జిపై సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ జరిగిన వైనంపై సీసీ టీవీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. హఠాత్తుగా బైక్ స్కిడ్ అయినట్లుగా అందులో ఉంది. బహుశా రోడ్డుపై ఉన్న ఇసుక కారణంగా బైక్ టైర్ స్కిడ్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ట్రయంఫ్ బైక్ ను సాయి ధరమ్ తేజ్ నడుపుతున్నారు. ఆ బైక్ సామర్థ్యంతో పోలిస్తే సాయి ధరమ్ తేజ్ మరీ వేగంగా ఏమీ వెళ్లడం లేదని అర్థం చేసుకోవచ్చు. రాత్రంతా ముగ్గురు వైద్యుల బృందంతో అబ్జర్వేషన్లో ఉంచారు. తాజా పరిస్థితిని మెడికల్ బులెటిన్ ద్వారా వెల్లడించనున్నారు.
సాయి ధరమ్ తేజ్ మెగా క్యాంప్ హీరోనే అయిన తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆయన సామాజిక ఆంశాలపై స్పందిస్తూ ఉంటారు. నలుగురికి సాయం చేయడానికీ ముందు ఉంటారు. సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే గ్రూపులకు అతీతంగా అందరితోనూ సన్నిహితంగా ఉంటారు. ఈ కారణంగా సాయి ధరమ్ తేజ్‌పై అందరికీ మంచి అభిమానం ఉంది. ప్రమాద వార్తతెలియగానే పెద్ద ఎత్తున అటు మెడికర్ ఆస్పత్రికి.. అటు అపోలో ఆస్పత్రికి నటులు.. ఇతర ప్రముఖులు తరలి వచ్చారు.
సాయి ధరమ్‌కు అయిన గాయాల కారణంగా ఆయన మళ్లీ షూటింగ్లో పాల్గొనడానికి బాగా టైం పట్టే అవకాశం ఉంది. కాలర్ బోన్ ఫ్రాక్టర్స్ తగ్గిపోయినా గతంలోలా డాన్స్‌లు, ఫైట్స్ చేయడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సాయి ధరమ్ తేజ్ మాట్లాడే వీడియోను అపోలో ఆస్పత్రి వర్గాలు ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉంది.