తను తెలుగుదేశం పార్టీ అభిమానినే అని స్పష్టం చేశాడు హీరో శివాజీ. ఈ విషయంలో వేరే సందేహం ఏమీ లేదని.. ఏపీ సీఎంగా చంద్రబాబు ఎంతగా కష్టపడుతున్నాడో తనకు తెలుసు అని.. శివాజీ చెప్పుకొచ్చాడు. తను ఎన్టీఆర్ అభిమానిని అని, తెలుగుదేశం పార్టీ అభిమానిని అని, చంద్రబాబు అవసరం ఏపీకి ఇప్పుడు ఎంతో ఉందని శివాజీ వ్యాఖ్యానించాడు. ఇలా తెలుగుదేశం అభిమానినే అని చెప్పుకున్న శివాజీ ఇదే సమయంలో మోడీపై మాత్రం దుమ్మెత్తిపోశాడు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ని “సన్నాసి’’ గా అభివర్ణించాడు ఈ హీరో!
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోడీ మోసపూరిత వైఖరిని అవలంభిస్తున్నాడని, దేశాలు పట్టుకు తిరుగుతూ తను ఎన్నికల ముందు ఏపీకి ఇచ్చిన హామీ ఏమిటో మోడీ మరిచిపోయాడని.. ఈ విధంగా ప్రధానమంత్రి ఒక సన్నాసిలా వ్యవహరిస్తున్నాడని.. అంటూ శివాజీ విరుచుకుపడ్డాడు. ఇటీవల ఒక ప్రెస్ మీట్లో ప్రత్యేక హోదా అంశం గురించి స్పందిస్తూ.. చంద్రబాబుపై విరుచుకుపడినట్టుగా మాట్లాడాడు ఈ సినిమా హీరో. ఎంత సంపాదించుకుంటావ్.. అద్దంలో నిన్ను నువ్వు చూసుకొంటూ ప్రశ్నించుకో అంటూ ఏక వచనంలో విరుచుకుపడ్డాడు.
మరి ఈ మాటలన్నీ ఏపీ సీఎం చంద్రబాబునే అనుకొంటే.. ఇప్పుడు మాత్రం అలాంటిదేమీ లేదని క్లారిటీ విచ్చాడు శివాజీ. తను చంద్రబాబుకు అభిమానినే అని, చంద్రబాబు బాగా కష్టపడుతున్నాడని కితాబులిచ్చాడు. ఇదే సమయంలో మోడీ పై మాత్రం తన ఆగ్రహావేశాలను వ్యక్తపరిచాడు హీరో. సో ఈయన దాడి ఇక కేవలం బీజేపీ మీద మాత్రమేనేమో!