‘పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్’ అని ఎవరో అన్నారు. ఎందుకొచ్చిన గొడవా అనుకొన్నారేమో.. నూటికి 70 శాతం మగరాయుళ్లు పొగరాయుళ్లుగా మారిపోయారు. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని నెత్తీ నోరూ మొత్తుకొన్నా మెదడుకు ఎక్కించుకోరు. గుప్పు.. గుప్పు మని పొగ ఊదడం తప్ప.
మన స్టార్ హీరోల్లో కొంతమందికి పొగతాగే అలవాటు వుంది. సినిమాల్లో స్టైల్ గా సిగరెట్ కాలిస్తే.. చూడ్డానికి బాగుంటుంది. ఎలివేషన్లు అదురుతాయ్. అయితే అదే పనిగా సెట్లో సిగరెట్లు ఊది పారేస్తుంటే.. చూసే వాళ్లకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఓ బడా హీరో విషయంలో ఇదే జరుగుతోంది. తానో చైన్ స్మోకర్. సిగరెట్ తరవాత సిగరెట్ అవ్వగొట్టేస్తుంటాడు. ‘బ్రేక్..’ చెప్తే చాలు. చేతికి సిగరెట్ అందించాల్సిందే. రోజుకి ఐదారు పెట్టెలైనా హుష్ కాకి. ‘సర్లే ఇలాంటి హ్యాబిట్లు చాలామందికి ఉంటాయ్.. స్టార్ హీరోకి ఉంటే తప్పేంటి’ అని అనుకోవొచ్చు. కాకపోతే.. ఈ తాగుడు మరీ అతి అయిపోయిందట. సెట్లో ఈ హీరో చుట్టూ ఇద్దరు అసిస్టెంట్లు యాష్ ట్రే పట్టుకొని తిరగాల్సివస్తోందని, సిగరెట్ కోసమే.. ‘బ్రేక్’ తీసుకొనే సందర్భాలు చాలా ఉన్నాయని.. ఇక్కడితో ఆగినా గొడవలే లేదని, ఈమధ్య ఈ ఎఫెక్ట్ తోనే హీరో అనారోగ్యం పాలయ్యాడని, డాక్టర్లు ‘సిగరెట్ బంద్ చేయాలి’ అని గట్టిగా చెప్పారని, అయినా హీరో ఈ అలవాటు వదులుకోవడం లేదని.. టాక్ నడుస్తోంది.
నిర్మాతల భయం ఏమిటంటే.. ఈ ఎఫెక్ట్ తో ఆరోగ్యం మళ్లీ దెబ్బతింటే షూటింగులు, షెడ్యూళ్లూ కాన్సిల్ అవుతాయి. తరవాత ఆ భారం వాళ్ల నెత్తిమీదే కదా పడేది. కొంతమంది హీరోలు ఇలానే చైన్ స్మోకర్లుగా మారాక, మెల్లిమెల్లిగా అలవాటు తగ్గించుకొంటూ వచ్చి, ఇప్పుడు పూర్తిగా సిగరెట్లు మానేశారు. మహేష్ బాబు కీ ఇది వరకు ఈ అలవాటు వుంది. కానీ ఓ పుస్తకం చదివాక… సిగరెట్ తాగడం మానేశాడు. ఆ పుస్తకమేదో.. ఈ హీరో చేతిలో ఎవరైనా పెడితే బాగుంటుందేమో?