మళ్లీ రావాతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్టే కనిపించిన సుమంత్.. ఇప్పుడు మరీ వరుస ఫ్లాపుల్ని ఎదుర్కుంటున్నాడు. సుబ్రహ్మణ్యపురం, ఇప్పడు ఇదం జగత్ రెండూ ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. సుబ్రహ్మణ్యపురంకి కాస్తో కూస్తో ఓపెనింగ్స్ అయినా దక్కాయి. ఇదం జగత్ అయితే మరీ దారుణం. ఈ సినిమాకి సరైన పబ్లిసిటీ లేకుండా పోయింది. సినిమా వస్తోందన్న సంగతి కనీసం ఫిల్మ్ మీడియాకు కూడా తెలీదంటే.. పరిస్థితి అర్థం చేసుకోవొచ్చు. ఇంత దారుణమైన పబ్లిసిటీ తన సినిమాకి ఎప్పుడూ లేదని సుమంత్ ఇప్పుడు వాపోతున్నాడు.
ఈ విషయమై సుమంత్ నిర్మాతకు చివాట్లు పెట్టాడట. తన కెరీర్లో ఇంత దారుణమైన ఓపెనింగ్స్ ఏ సినిమాకీ రాలేదని, వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కూడా మంచి ఓపెనింగ్సే దక్కాయని, పబ్లిసిటీ చేయడానికి ఇష్టం లేకపోతే.. అసలు సినిమా ఎందుకు తీశారని..? నిర్మాతకు చివాట్లు పెడుతూ ఓ లేఖ రాశాడట. పబ్లిసిటీ విషయంలో ఇంత నిర్లక్ష్యం చేస్తారని తాను అనుకోలేదని, కనీసం ఆ బాధ్యత తనకు అప్పగించినా బాగుండేదని ఆ లేఖలో పేర్కొన్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇదం జగత్పై సుమంత్ చాలా నమ్మకంగా ఉండేవాడు. ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదని, ఇది క్షణం తరహా సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేసేవాడు. కానీ బాక్సాఫీసు దగ్గర సరైన ఫలితం రాకపోవడంతో తన ఆవేదనని నిర్మాత ముందు వెళ్లగక్కాడు.