ప్రముఖ కథానాయకుడు సూర్య కొత్త వివాదంలో చిక్కుకున్నారు. సూర్య చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థని కించపరిచేలా ఉన్నాయని తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి ఎస్ఎం సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యపై కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తమిళనాడులో ఒకేరోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై సూర్య కాస్త ఘాటుగానే స్పందించాడు.
కరోనా భయంతో కోర్టులకు రాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయ విచారణలు చేస్తున్న గౌరవ న్యాయమూర్తులు.. విద్యార్థులను మాత్రం నీట్ పరీక్షకు హాజరు కమ్మంటూ ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరమని, ప్రభుత్వం, కోర్టులు విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నాయ`ని సూర్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కారణ నేరమే అని సూర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ప్రధాన న్యాయమూర్తి ఈ విషయంలో ఎలా స్పందిస్తారో, కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. కాకపోతే.. సూర్య ట్వీట్ల పట్ల సామాన్యుల నుంచి మంచి స్పందనే వస్తోంది. సూర్య వ్యాఖ్యల్లో తప్పు లేదని సూర్య అభిమానులు మద్దుతు తెలుపుతున్నారు.