అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే లవర్ బాయ్ హీరో తరుణ్ కూడా ఈ సినిమాతో అసోసియేట్ అవుతున్నట్లుగా ఫిల్మ్ నగర్ లో వార్తలు షికార్లు చేస్తున్నాయి . వివరాల్లోకి వెళితే..
తరుణ్ బాలనటుడిగా ఉన్నప్పుడే అనేక హిట్లు పొందుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారాక నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ తో పాటు కొన్ని హిట్ సినిమాలలో నటించారు. అయితే కథలను ఎన్నుకునే విషయంలో పొరపాట్లు చేయడం, లవర్ బాయ్ ఇమేజ్ నుండి మరో రకమైన ఇమేజ్ లోనికి తనను తాను రూపాంతరం చేసుకోలేకపోవడం వంటి వాటితో పాటు ఇతర కొన్ని కారణాల వల్ల తెరమరుగయ్యారు. అయితే ఇప్పుడు నటుడిగా కాకుండా మరో రకంగా పుష్ప సినిమాతో తరుణ్ అసోసియేట్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఆహా ఓటీటీ లో విడుదలైన అనుకోని అతిథి సినిమాలో నటుడు ఫహాద్ ఫాజిల్ కి తరుణ్ డబ్బింగ్ చెప్పారు. ఆ డబ్బింగ్ చాలా అద్భుతంగా కుదిరింది. ఫహాద్ ఫాజిల్ స్వతహాగా చాలా మంచి నటుడు. పుష్ప సినిమాలో ప్రస్తుతం విలన్ గా నటిస్తున్నాడు ఫహాద్ ఫాజిల్. మొదట్లో ఈ పాత్రను విజయ్ సేతుపతి కి అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. దాంతో అవకాశం ఫహద్ ఫాసిల్ కు వచ్చింది. పుష్ప సినిమాలో కూడా తన పాత్రకు తరుణ్ చేతనే డబ్బింగ్ చెప్పించాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పుష్ప సినిమాలో తరుణ్ కనిపించకపోయినా వినిపిస్తారని తెలుస్తోంది. ఒకవేళ విలన్ పాత్ర లకి డబ్బింగ్ తో అదుర్స్ అనిపిస్తే తదుపరి కాలంలో విలన్ పాత్రలు కూడా తరుణ్ ని వెతుక్కుంటూ వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.
మరి ప్రస్తుతం వినిపిస్తున్న ఈ రూమర్స్ ఎంతవరకు నిజం అన్నది వేచి చూడాలి.