పొరిగింటి పుల్లకూరకి రుచెక్కువ. పరాయి నటీనటుల ధర ఎక్కువ. ఇది చిత్రసీమ ఎరిగిన సత్యమే. పొరుగుపై ప్రేమ మనకెప్పటికీ పోదు. ఈమధ్య అది మరీ ఎక్కువ అవుతోంది. పక్క రాష్ట్రం నుంచి నటీనటుల్ని, కథల్ని, టెక్నీషియన్లనీ, డైరెక్టర్లనీ దిగుమతి చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారంతా. పాన్ ఇండియా మోజులో అది బాగా పెరిగిపోయింది. హీరోలూ వాళ్లే. విలన్లూ వాళ్లే. క్యారెక్టర్ ఆర్టిస్టులూ వాళ్లే.
ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో, అప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడానికి చిత్రసీమ ఎప్పుడూ వెనుకంజ వేయదు. ఇప్పుడు పొరుగింటి నటీనటులు, సాంకేతిక నిపుణులూ అదే చేస్తున్నారు. గొంతెమ్మ కోర్కెలతో.. మన నిర్మాతల్ని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇటీవల తమిళ హీరోతో.. తెలుగు నిర్మాత ఓ సినిమా చేయడానికి డీల్ కుదుర్చుకున్నాడు. అందుకు భారీ పారితోషికం ఇవ్వడానికి సైతం రెడీ. తమిళంలో కూడా నిర్మాతలు ఇవ్వనంత భారీ పారితోషికం ఇవ్వడానికి తెలుగు నిర్మాత ఒప్పుకున్నాడు. అక్కడితే ఆ హీరో సంతృప్తి పడలేదు. తన టీమ్‌కి జీత భత్యాలన్నీ సదరు నిర్మాతే చెల్లించాలని షరతు పెట్టాడు. సరికదా.. తమిళ శాటిలైట్, ఓటీటీ హక్కులపైకా కన్నేసినట్టు సమాచారం. అవి కూడా తన పేర రాయాల్సిందేనని ఇప్పుడు పట్టుబడుతున్నాడట.
తమిళంలో అగ్ర హీరోలు ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారంటే ఓకే. అరకొర మార్కెట్ తో నెట్టుకొస్తున్నవాళ్లు కూడా ఇదే తరహాలో డిమాండ్ చేయడం విచిత్రంగా అనిపిస్తోంది. ఈమధ్య టాలీవుడ్ లో రూపొందుతున్న ఓ క్రేజీ సినిమాకి మలయాళం నుంచి ఓ స్టార్ ని పట్టుకొచ్చారు. అందుకు గానూ… ఏకంగా 3 కోట్ల పారితోషికం ఇవ్వడానికి సిద్ధ పడ్డారు. ఇప్పుడాయన మలయాళం రైట్స్ మొత్తం అడుగుతున్నాడట. మలయాళం రైట్స్ మొత్తం ఆయనకే ఇచ్చేస్తే.. మలయాళం మార్కెట్ క్యాష్ చేసుకుందామన్న తెలుగు నిర్మాత ఆశ… అడియాశ అయినట్టే. సాధారణంగా.. పారితోషికాలతో సరిపెట్టుకునే నటీనటులు, ఇప్పుడు రైట్స్ పై దృష్టి పెట్టడం.. ఇటు పారితోషికం, అటు హక్కులు రెండూ గంపగుత్తలా లాగేసుకోవాలనుకోవడం, తమ అసిస్టెంట్ల జీత భత్యాలు సైతం.. నిర్మాతలపై రుద్దేయడం ఇవన్నీ తెలుగు వాళ్లకు మింగుడు పడని విషయాలు. కావాలని వెళ్లినప్పుడు ఇలాంటి ఖర్చుల్ని భరించాల్సిందే. ఇలాంటి ఒకట్రెండు షాకులు తగిలితే గానీ, పొరిగింటి పుల్లకూర చేదెక్కదు.