అమేజాన్, జీ5, ఆహా.. ఇవన్నీ విడుదలకు రెడీ అయిన సినిమాల్ని తమ వైపుకు లాక్కోవాలని చూస్తున్నాయి. మంచి రేట్లతో ఆకట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. అయితే… నిర్మాతలకూ, ఓటీటీ సంస్థలకూ మధ్య హీరోలే అడ్డంకి. సినిమాల్ని నేరుగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ పై విడుదల చేసుకోవడానికి నిర్మాతలు సిద్ధమే. కానీ హీరోలే రెడీగా లేరు. దానికి తోడు.. అమేజాన్ లాంటి సంస్థల షరతులు సైతం వాళ్లకు నచ్చడం లేదు.
సినిమాల్ని ఓటీటీకి ఇవ్వడమే కాదు. ఇప్పుడు కాస్త ప్రచారం చేసి పెట్టాలన్నది అమేజాన్ విధిస్తున్న షరతు. అమేజాన్లో సినిమా స్ట్రీమింగ్ అవ్వడానికి ముందు… హీరోలు, హీరోయిన్లు, మిగిలిన సాంకేతిక నిపుణులు ప్రచారంలో పాల్గోవాలని అమేజాన్ డిమాండ్ చేస్తోంది. సినిమా విడుదలకు ముందు ఎలాగూ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు పబ్లిసిటీలో బిజీగా ఉంటారు. ఆ ప్రచారం ఏదో తమకు చేసి పెట్టాలన్నది అమేజాన్ షరతు. అంటే.. ఫేస్ బుక్ లైవ్ ల ద్వారా ఇంటర్వ్యూలు ఇవ్వడం, `ఫలానా రోజున సినిమా వస్తోంది, చూడండి` అని చెప్పడం.. ఇలాంటివన్నమాట. దిన పత్రికల్లోనూ, టీవీల్లోనూ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవ్వబోతోందో, దానికి సంబంధించిన యాడ్లు నిర్మాతలే భరించాలి. ఇదీ.. అమేజాన్ షరతు. యాడ్లు ఇవ్వడానికి నిర్మాతలకు అభ్యంతరం లేకపోవొచ్చు. అది తమ ఖర్చులో భాగమే. అయితే హీరోలు మాత్రం పబ్లిసిటీకి నో అంటున్నార్ట. `మీరు ధియేటర్లో సినిమా విడుదల చేస్తానంటే ఎంతైనా పబ్లిసిటీ చేస్తాం.. ఇలా ఓటీటీకి ఇచ్చుకుంటే మాకు సంబంధం లేద`ని తెగేసి చెబుతున్నార్ట. దాంతో నిర్మాతలకు ఏం చేయాలో పాలు పోవడం లేదు.
ఇటీవల ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీటింగ్ ఒకటి జరిగింది. అందులో నిర్మాతలంతా చర్చించిన ప్రధాన విషయం… ఓటీటీలో సినిమాల్ని అమ్ముకోవడం గురించే. అమేజాన్, హాట్ స్టార్ లాంటి సంస్థలు విధిస్తున్న కొత్త షరతులేంటి? వాటిలో ఏవి నిర్మాతలకు భారంగా ఉన్నాయి? హీరోల్ని ఒప్పించడం ఎలా? అనే విషయంపై నిర్మాతలు చర్చలు జరిపార్ట. కొంతకాలం వేచి చూసే ధోరణే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పబ్లిసిటీ విషయంలో హీరోలపై ఒత్తిడి తీసుకురాకపోతే… ఈ సమస్య నుంచి నిర్మాతలు గట్టెక్కినట్టే. హీరోలూ పెద్ద మనసు చేసుకుని ఆ ఆన్లైన్ ప్రమోషన్లు ఒప్పుకుంటే ఎలాంటి గొడవా ఉండదు.