సినిమాకి పబ్లిసిటీ ప్రాణం. ఫ్లాప్ అయిన సినిమాక్కూడా ‘బాగుంది. బాగుంది..’ అని ప్రచారం చేసుకుంటూ వెళ్లడమే. కాస్త నెగిటీవ్ టాక్ వచ్చినా సినిమా మటాషైపోతుంది. అందుకే తమ సినిమా పబ్లిసిటీ విషయంలో దర్శక నిర్మాతలు చాలా పట్టుగా ఉంటారు. అయితే తమ సినిమాపై తామే సెటైర్ వేసుకున్నవాళ్లని మీరెప్పుడైనా చూశారా? సినిమా థియేటర్లో ఉండగా – ‘మా సినిమా పోయిందట..’ అని పోస్టరేసుకున్నవాళ్లెవరైనా ఉంటారా? బాపు – రమణ ఉన్నారుగా.
బాపు – రమణ చాలా ఇష్టపడి, ప్రేమించి తీసిన సినిమా `అందాల రాముడు`. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు, చాలా ఖర్చు పెట్టారు. కానీ.. సినిమా విడుదలైనప్పుడు స్పందన అంతంత మాత్రమే. పూర్తి వినోదాత్మక సినిమా ఇది. బాపు – రమణల స్టైల్ అర్థం చేసుకోవడంలో అప్పటి ప్రేక్షకులు విఫలమయ్యారు. హెవీ డ్రామా, ఘాటైన సన్నివేశాలు గట్రా లేకపోవడంతో కలక్షన్లు బాగా మందగించాయి. గాలి పోగేసి తీశారని, చెట్టు కింద సీన్లు తీసి చుట్టేశారని రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి.
కానీ బాపు – రమణలు కృంగిపోలేదు. చిత్రమైన పబ్లిసిటీ చేశారు. వాళ్ల సినిమాపై వాళ్లే జోకులు వేసుకున్నారు. ”చూసినోళ్లకూ, తీసినోళ్లకూ అంచనాలు తలకిందులు చేసిన చిత్రం..” అంటూ ఓ పోస్టర్ వేశారు. అందులో బోటు తిరగబడినట్టు, అందరూ కొట్టుకుపోతున్నట్టు కార్ట్యూన్ ఒకటి. అందాల రాముడు 70వ రోజు.. అనే మరో పోస్టర్ విడుదల చేశారు. ఏడా?? అని ఓ ప్రేక్షకుడు అడిగినట్టు – ”ఏడా లేదు, బేడా లేదు. సినిమా రిలీజైన రోజు నుంచి ఈవాల్టికి 70వ రోజు” అంటూ ఓ సెటైర్ వేసుకున్నారు.
ఈ పోస్టర్లు చూసి డిస్టిబ్యూటర్లు కంగారు పడ్డారు. ”సినిమా అసలే నీరసంగా నడుస్తోంది.. దాని తోడు మీ వెక్కిరింతలా. ఇది నాగేశ్వర్రావు గారికి తెలిస్తే మీ తాట తీస్తారు” అంటూ బెదిరించారు. ఆఖరికి ఈ విషయం అక్కినేని వరకూ వెళ్లింది. ”అబద్దాలు చెప్పకుండా, కోతలు కోయకుండా.. నికార్సయిన నిజం చెప్పారు..” అంటూ అక్కినేని మెచ్చుకున్నారు.
చిత్రంగా ఈ నెగిటీవ్ పబ్లిసిటీనే సినిమాకి కావల్సినంత హైప్ తీసుకొచ్చింది. ముందు బాలేదు అన్నవాళ్లు.. ‘ఫర్లేదు.. బాగానే ఉంది’ అనే స్థాయికి వెళ్లారు. అక్కడి నుంచి ‘బాగుంది.. హిట్టు.. ఇంతకంటే ఏం కావాలి’ అనుకుంటూ వెళ్లారు. ఫలితం.. పోయిందనుకున్న అందాల రాముడు.. సెకండ్ రన్, థర్డ్ రన్లో తెగ ఆడేసింది. వంద రోజుల పోస్టరు నిజంగానే పడిపోయింది. అదీ… బాపు – రమణల మ్యాజిక్కు.