రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా మొదలు కావాలి కానీ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ పూర్తి కావాలి. దీనికి తాత్కాలిక బ్రేక్ పడింది. దీంతో రవితేజ, హరీష్ శంకర్ కలసి గప్ చుప్ గా సినిమా మొదలుపెట్టేశారు. నిన్న పూజ కార్యక్రమంతో పాటు షూటింగ్ కూడా సైలెంట్ గా స్టార్ట్ చేశారు. బాలీవుడ్ సినిమా ‘రైడ్’ సినిమాకి రీమేక్ ఇది. అజయ్ దేవగన్, సౌరభ్ శుక్లా, ఇలియానా డిక్రూజ్ నటించిన రైడ్ సినిమా 2018లో వచ్చింది. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా ఇన్కమ్ టాక్స్ రైడ్ నేపధ్యంలో వచ్చిన సినిమా మంచి విజయాన్నే అందుకుంది.
ఇప్పుడీ సినిమా రవితేజ కోసం రీమేక్ చేస్తున్నారు హరీష్. అంతా ఓకే కానీ ఈ సినిమాకి ప్రస్తుతం హీరోయిన్ సమస్యగా మారింది. హరీష్ లక్కీ ఛార్మ్ పూజహెగ్డే ని సంప్రదిస్తే ఆమె డేట్లు ఖాళీ లేవు. మీనాక్షి చౌదరిని కూడా అనుకున్నారు కానీ కుదరలేదు. ఇలియానా కూడా అనుకున్నారు కానీ ఆమె కూడా అందుబాటులో లేదు. వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి మళ్ళీ ఉస్తాద్ సెట్స్ పైకి వచ్చే ప్లాన్ లో వున్నాడు హరీష్. అలా బల్క్ గా డేట్స్ ఇచ్చే హీరోయిన్ కోసం చూస్తున్నారు. మరి ఎవరు కుదురుతారో చూడాలి.