తొలి ప్రేమతో నవతరం ప్రేమకథా చిత్రాలకు కొత్త బాట పరిచాడు కరుణాకరన్. అదేం మహత్మ్యమో… ఆతరవాత ఆ స్థాయి సినిమా ఒక్కటే పడలేదు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా కాస్త ఓకే అనిపించింది. అప్పటి నుంచి విజయం కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమా ఓకే అయ్యింది. కె.ఎస్. రామారావు నిర్మాత. చాలా రోజుల క్రిందటే క్లాప్ కొట్టారు. కానీ ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి తాజా అప్ డేట్ వచ్చింది. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. కథానాయికగా అనుపమ పరమేశ్వరన్‌ని ఎంచుకున్నారు. కరుణాకరన్ సినిమాల్లో హీరోకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో, కథానాయిక పాత్రకీ అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే పడిందట. అందులోఅందం, అభినయం రెండూ కలబోసిన కథానాయిక ఉండాలన్న ఉద్దేశంతో చిత్రబృందం గట్టి ప్రయత్నాలే చేసింది. ఓ కొత్తమ్మాయిని తీసుకోవాలనుకొని ఫొటో షూట్స్ కూడా చేశారు. చివరికి అనుపమ పరమేశ్వరన్‌ని ఎంచుకున్నారు. ప్రేమకథా చిత్రాలకు పెట్టింది పేరు కరుణాకరన్. ఈసారీ లవ్ స్టోరీనే తీస్తున్నాడు. ప్రేమకథా చిత్రాల్లో కొత్త ఒరవడికి ఈ చిత్రం నాంది పలుకుతుందని చిత్రబృందం గట్టి నమ్మకంతో చెబుతోంది. మరి ఈ సినిమాతోనైనా కరుణాకరన్ జాతకం మారుతుందేమో చూడాలి.