అఖిల్ తదుపరి సినిమా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అనేది ఎప్పుడో ఫిక్సయిపోయింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లోనే నిర్మిస్తారు. ఈ పాటికే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ… ముందు అనుకొన్న కథ పక్కన పెట్టి, కొత్త కథ రాసుకోవడం వల్ల ఈ సినిమా కాస్త ఆలస్యమైంది. అయితే విక్రమ్ కె.కుమార్ దాదాపుగా కథ సిద్ధం చేసేశాడని, దానికి నాగ్ కూడా పచ్చ జెండా ఊపాడని ఇక పట్టాలెక్కేయడమే ఆలస్యమని తెలుస్తోంది. ఈ లోగా కథానాయికల్ని కూడా సెట్ చేసేసుకొంటే.. సినిమా మొదలెట్టేయొచ్చని నాగ్ భావిస్తున్నాడట. అందుకే ఇప్పుడు అఖిల్ కోసం హీరోయిన్ల అన్వేషణ ప్రారంభమైంది. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలుంటారని తెలుస్తోంది. అందులో ఓ పాత్రకు గానూ… కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేమ్ మెహరీన్‌ని తీసుకొన్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు మరో నాయికీ ఫిక్సయిపోయింది.
ఈసారి ఆ ఛాన్స్ అనుపమ పరమేశ్వరన్‌కి దక్కినట్టు సమాచారం. ప్రేమమ్, అఆ చిత్రాలతో ఆకట్టుకొన్న అనుపమ, రీసెంట్గా వచ్చిన శతమానం భవతిలోనూ అదరగొట్టేసింది. దాంతో అనుపమకి ఆఫర్లు జోరందుకొన్నాయి. అందులో భాగంగానే అఖిల్ సినిమా ఛాన్సూ దక్కించుకొందని తెలుస్తోంది. ఆల్రెడీ నాగచైతన్యతో కలసి నటించి, అక్కినేని వారి హీరోయిన్ అయిపోయిన ఈ భామ ఇప్పుడు అఖిల్‌తోనూ డ్యూయెట్లు పాడబోతోందన్నమాట. విక్రమ్ తెలుగు సినిమాలు ఇష్క్, మనం చిత్రాలకు సంగీతం అందించిన అనూప్ రూబెన్స్… ఈ సినిమాకీ పనిచేయనున్నాడని సమాచారం. మార్చి చివర్లో ఈ సినిమాకి కొబ్బరికాయ్ కొట్టేసే ఛాన్సుంది.