ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. పెళ్లి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇప్పటి వరకూ ఆయన చిన్న తనంలోనే పెళ్లి చేసుకున్నారని.. ఆయన భార్య జశోదా బెన్ అని అందరికీ తెలుసు. కానీ ఆరెస్సెస్ కోసం కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి.. చిన్న వయసులోనే ఆమెను వదిలి వెళ్లిపోయారు. కానీ విడాకులు ఇవ్వలేదు. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ మూడు రోజుల కిందట.. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్గా ఉన్న అనందిబెన్ పటేల్ మోదీ పెళ్లి చేసుకోలేదని వ్యాఖ్యానించారు. కాస్తా సోషల్మీడియాలో వైరల్ అయింది. దీంతో జశోదాబెన్ స్పందించారు. ఆనందీబెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోక్సభ ఎన్నికల సందర్భంగా వేసిన నామినేషన్లో తనకు వివాహం అయ్యిందని, భార్య పేరు జశోదాబెన్ అని ఆయనే స్వయంగా పేర్కొన్నారని ఆమె గుర్తు చేశారు. మా ఆయన ఎంతో గౌరవనీయమైన వ్యక్తి. రాముడి లాంటి వారు అని జశోదాబెన్ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. అంతే కాదు.. అనందీబెన్పై కొన్ని ఆరోపణలు కూడా చేశారు. ఆమె చేసిన కొన్ని పనులు మోదీ పేరును చెడగొట్టాయని వ్యాఖ్యానించారు. ఉన్నత స్థానంలో ఉన్న మహిళ … తన లాంటి సామాన్య టీచర్ గురించి అలా ఎలా మాట్లాడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నరేంద్రమోడీ వ్యక్తిగత విషయాలు ఇప్పటికీ.. గోప్యమే. అందుకే.. ఎలాంటి చిన్న విషయం బయటకు వచ్చినా అది వైరల్ అయిపోతూ ఉంటుంది. గతంలో ఆంధ్రజ్యోతి పత్రికలో.. మానసిన విశ్లేషకుడు.. సి.నరసింహారావు రాసిన విశ్లేషణలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వాటిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే వివాదాస్పదం అవుతోంది. అనందీబెన్ పటేల్..మోదీ పెళ్లి చేసుకోలేదని ఏ ఉద్దేశంతో అన్నారో కానీ.. ఇప్పుడు మోదీ వ్యక్తిగత విషయాలను మరోసారి ఆన్లైన్లో వైరల్ చేసి పెట్టారు.