నైన్టీస్ లో ఓ ఊపు ఊపేసిన కథానాయిక రంభ. తన గ్లామర్ తో ఆ తరాన్ని పిచ్చెక్కించేసింది. రంభకి ఫ్యాన్స్ ఉంటే ఎలా ఉంటారు? వాళ్లు రంభని కీర్తిస్తూ పాట పాడితే అది ఏ రేంజ్లో ఉంటుంది? అనే ఆలోచన అజయ్భూపతికి వచ్చి ఉంటుంది. లేదంటే.. తాను కూడా స్వతహాగా రంభ ఫ్యాన్ అయి ఉంటాడు. అందుకే `మహా సముద్రం`లో రంభ అందాల్ని కొనియాడుతూ… ఓ పాట పెట్టేశాడు. శర్వానంద్, జగపతిబాబు.. విశాఖ బీచ్లో బీర్ కొడుతూ – రంభ కటౌట్లు చూసి మురిసిపోతూ.. పాడుకునే మాస్ పాట… `హే రంభ.. హే.. రంభ`.
చైతన్య భరద్వాజ్ సంగీతం అందించిన చిత్రమిది. భాస్కరభట్ల సాహిత్యం అందించారు. మాస్ పాటలంటే రెచ్చిపోయే… భాస్కరభట్ల, ఈసారీ తన కలాన్ని మసాలాతో దట్టించి, రఫ్ఫాడించారు.
మందే.. ఇక మందే…
విశాఖపట్నం బీచూ
తాగొచ్చు.. ఊగొచ్చు
ఏదైనా చేయొచ్చు – అంటూ మొదలై, ఆ తరవాత చరణాల్లో రంభ స్త్రోత్తం మొదలవుతుంది.
కొర్రామేను మాదిరి
కొర్రా కొర్రాగుంటది
కుర్రాగాళ్ల గుండెకి
గాలం వేస్తదిరా
ఎర్రా పెదవి కొరికితే
సర్రా సర్రా నవ్వితే
బుర్ర తిరిగిపోతది
గిరా గిరా గిరా గిరా
హే.. రంభా రంభ
పండగే ప్రారంభ
ఎక్కదే గుడుంబా… అంటూ జోరు చూపించారు. తొలిచరణానికి ముందు భాస్కర భట్ల మాటలు కూడా వినిపిస్తాయి. మిగిలిన రెండు చరణాలూ… మరింత మాసీగా సాగాయి.
దీని నడుం బాణాసంచా దుకాణమే
ముట్టుకుంటే ప్రమాదమే.. – ఇలాంటి తమాషా పోలికలతో – పాటని మరింత రక్తికట్టించాడు భాస్కరభట్ల. అజయ్ భూపతి తొలి సినిమా `ఆర్.ఎక్స్ 100`లో పాటలన్నీ అదిరిపోయాయి. వాటికి సంగీతం అందించిన చైతన్యనే మళ్లీ ఈ సినిమాకీ స్వరాలు అందిస్తున్నాడు. తొలి పాటతోనే ఈ ద్వయం అదరగొట్టేశారు. ఇక మిగిలిన పాటలెలా ఉంటాయో..??