హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోంది. రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు ఎంక్వయిరీలుగా పెరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు డబ్బులు కట్టేసి ఇంట్లోకి వెళ్లిపోయేలా ప్రాజెక్టులు కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మార్కెట్ లో చిన్న గ్యాప్ కనిపిస్తోంది. మార్కెట్ ఎంక్వయిరీలు ఎక్కువగా లగ్జరీ ఫ్లాట్స్ కు లేవు కానీ.. అవి మాత్రం అందుబాటులో ఉన్నాయి.
ఐటీ కారిడార్ చుట్టుపక్కల చాలా చాలా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో కొన్ని హ్యాండోవర్ దశకు వచ్చాయి. అయితే ఏ ఒక్క ప్రాజెక్టులోనూ సగం కన్నా ఎక్కువ బుకింగ్స్ కాలేదని.. స్పాట్ సేల్స్ కోసం ఎదురు చూస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మాములుగా అయితే మోడల్ ఫ్లాట్ చూపించి మీ ఫ్లాట్ అదిగో అక్కడ ఉంటుందని గాల్లోకి చూపించే దశలోనే మార్కెట్ చేసుకుంటారు. కానీ మారిన పరిస్థితుల్లో ప్రాజెక్టును పూర్తి చేసినా పెండింగ్ ఫ్లాట్లు ఎక్కువగానే ఉంటున్నాయి.
కొన్నికంపెనీలకు ఇలాంటి ప్రాజెక్టుల్లోఅమ్మకం కాని ఫ్లాట్లు పెనుభారంగా మారుతున్నాయి. లిక్విడిటీ సమస్యను తెచ్చి పెడుతున్నాయి. అందుకే ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి. కాస్త మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రాజెక్టుల్ని నిర్మించి ఉంటే మాత్రం ఇలాంటి సమస్య వచ్చేది కాదని.. కానీ లగ్జరీ మార్కెట్ డిమాండ్ కన్నా ఎక్కువగా వాటి సప్లయ్ ఉండటం వల్ల ఈ సమస్య వచ్చిందని అంచనా. మరి ఎప్పటికీ ఈ సమస్య పరిష్కారం అవుతుందో?