హుజురాబాద్ ఫలితం.. కనీస ఓట్లు దక్కించుకోలేకపోవడం రేవంత్ రెడ్డిని సొంత పార్టీలో ఇబ్బంది పెడుతోంది. ఈ ఫలితంపై అనేక ఫిర్యాదులు హైకమాండ్‌కు వెళ్లడంతో స్వయంగా సమీక్ష చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. శనివారం ఢిల్లీకి రావాలని పీసీసీ నేతలతో పాటు హుజురాబాద్ అభ్యర్థిని కూడా పిలిచింది. ఈ ఓటమికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరే కారణమని సీనియర్లు గట్టిగా ఆరోపిస్తున్నారు. అయితే ఎన్నికల్లో కనీసం పార్టీకి వారు పని చేయలేదని రేవంత్ వర్గం గుర్తు చేస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని అధిష్టానం చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. పార్టీ ఓట్ల శాతం దారుణంగా పడిపోవడంపై పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం కోసమే కాంగ్రెస్ ఇలా చేసిందని.. దీని వెనుక రేవంత్ ఉన్నారని నివేదికలను రహస్యంగా హైకమాండ్‌కు పంపారు. రాష్ట్రంలో ఎలాగైనా బలపడాలని చూస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వానికి హుజూరాబాద్ ఫలితం మింగుడు పడటం లేదు. అనూహ్యంగా బీజేపీ పుంజుకోవటం కొంత ఇబ్బంది పరిస్థితులేనని భావిస్తోంది. అయితే అక్కడ పోటీ పార్టీల మధ్య జరగలేదని… కేసీఆర్- ఈటల మధ్య జరిగిన సమరమేనని చెప్పేందుకు రేవంత్ ప్రయత్నిస్తోది.
టీపీసీసీ చీఫ్ గా రేవంత్‌కు బాధ్యతలు అప్పగించిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో జోష్ వచ్చిందని అనుకుంటున్న సమయంలో ఇంత దారుణంగా హుజూరాబాద్‌లో ఓట్లు రావటంతో పార్టీలో నిస్తేజం ఆవరించింది.దీన్ని తొలగించి మళ్లీ కాంగ్రెస్‌లో జోష్ నింపేలా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలో అటు ఏఐసిసి.. ఇటు పీసీసీ కూడా ఉన్నాయి.