కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్ళు…నదుల అనుసంధానం అనే కాన్సెప్టుతో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరికాస్త సాగబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నీళ్ళు ఇవడానికి ఈ పధకాన్ని వాడబోతున్నారు.
రియల్టర్ల వత్తిడి మేరకే నీటి వసతి లేని అమరావతికి ప్రాంతానికి నీరివ్వడానికి హడావిడిగా పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని నిర్మిస్తున్నారని తెలుగు360డాట్ కామ్ ముందుగానే పసిగట్టి ప్రచురించింది. ప్రకాశం బారేజీకి ఎగువ 25 కిలోమీటర్ల దూరంలో నరి వెడల్పు తక్కువగా వున్న చోట మరొక బ్యారేజి నిర్మించి, గోదావరి నీటిని ఎడమవైపు నుంచి బ్యారేజిలోకి తీసుకుని, కుడివైపునుంచి కాల్వల ద్వారా రాజధాని ప్రాంతానికి పంపాలని రాష్ట్ర జలవనరుల శాఖ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
పట్టిసీమ ఎత్తిపోతల చుట్టూ ఇప్పటికే వివాదాలు వున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ వస్తున్నపుడు పోలవరం ఎందుకని…పోలవరం రాదని ముందే తెలుసా అని…కావలసిన కాంట్రాక్టరుకి కట్టబెట్టడం కోసమే 1800 కోట్ల రూపాయల పని మొదలు పెట్టారని విమర్శలు వచ్చాయి. ఇది పోలవరం ప్రాజెక్టులో భాగంకాదు కాబట్టి ఈ ఖర్చులు కేంద్రభరించబోదని బిజెపి నాయకులు చెబుతున్నారు.
రెండో పంట ఎలాగూ దైవాధీనమే పట్టిసీమ పంపుద్వారా మొదటి పంట నీళ్ళు కూడా కృష్ణాడెల్టాకే తీసుకుపోయి మానోట్లో మట్టికొడతారా అని పశ్చిమగోదావరి రైతులు నిరసన ప్రదర్శనలు చేశారు. డెల్టా అవసరాలకంటే అదనంగా వున్న నీటిని మాత్రమే అంటే పట్టిసీమ వద్ద 14 మీటర్ల నీరు వున్నప్పుడే గోదావరి నీటిని కృష్టా డెల్టాకు పంపుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆమేరకు జివొ విడుదల చేశారు.
అయితే ఆమేరకు నీరు లేనప్పుడు కూడా గోదావరి నీరు కృష్ణా లోకి ఎత్తి పోశారు. అదంతా ట్రయల్ రన్ అని సరిపెట్టు కోవచ్చు…ఈ ఖరీఫ్ లో ఈపాటికే పట్టిసీమనీరు కృష్ణా డెల్టాలోకి వెళ్ళాలి…నిర్మాణం పనులు పూర్తికాక ఎత్తిపోతల మొదలుకాలేదు. పనులు పూర్తయినా 14 మీటర్ల నీరు లేదు కనుక పంపింగ్ మొదలయ్యే స్ధితి లేదు. మరి ఎలా హేండిల్ చేస్తారు అని అడిగినపుడు ” సీలేరు నీరు వస్తుంది” అని ఇంజనీర్లు చెబుతున్నారు.
సీజనల్ గా నీరు ఇవ్వవలసిన స్ధితిలోనే ఇలావుంటే అమరావతి కి నిరంతరాయంగా నీరు ఇవ్వవలసిన పరిస్ధితిలో 14 మీటర్ల నీటి మట్టం వుండాలన్న నియమాన్ని మార్చక తప్పదు. అంటే గోదావరి పశ్చిమ డెల్టాను ఎండబెట్టే నీరు తరలించవలసి వస్తుంది.
ఇంకా మొలకెత్తని రాజధాని అమరావతి నీటి అవసరాలకోసం గోదావరిని అమరావతికి మళ్ళించి ధాన్యాగారమన్న పేరున్న పశ్చిమగోదావరిని ఎండబెట్టేస్తారన్న ఆలోచనే దిగులుని మిగులుస్తోంది.