Hidimba Movie Review
తెలుగు360 రేటింగ్ : 2.25/5
ఈ మధ్య కాలంలో ట్రైలర్ తో ఆసక్తిని పెంచిన చిత్రాల్లో హిడింబ ఒకటి. అశ్విన్ బాబు ప్రధాన పాత్రలో అప్పుడెప్పుడో మంచు మనోజ్ తో ‘మిస్టర్ నూకయ్యా’ సినిమా తీసిన అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన ‘హిడింబ’ ప్రమోషనల్ కంటెంట్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే ప్రేక్షకుల ద్రుష్టిని ఆకర్షించింది. ‘హిడింబ’ ఓ హైబ్రీడ్ జోనర్ చిత్రమని, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కు చరిత్రని జోడించామని చిత్ర యూనిట్ చెప్పింది. మరా చరిత్ర, నేరపరిశోధన కలయిక సరిగ్గా కుదిరిందా? హిడింబ ప్రేక్షకులకు థ్రిల్ ని పంచిందా?
నగరంలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ కి గురౌతుంటారు. ఈ కేసుని చేధించడానికి ఆధ్య ( నందిత శ్వేతా) ని స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తారు. అదే టీంలో అభయ్ (అశ్విన్ బాబు ) చేరతాడు. ఆద్య, అభయ్ ల మధ్య ఒక గతం వుంటుంది. ఇద్దరూ ఒకే చోట ట్రైనింగ్ అవుతారు. ఆధ్య, సివిల్స్ పాసై ఐపీఎస్ అవుతుంది. అభయ్ మాత్రం పోలీస్ క్యాడర్ లోనే ఉంటాడు. ట్రైనింగ్ లో దగ్గరైన ఈ ఇద్దరూ తర్వాత ఏవో కారణాల వలన విడిపోతారు. ఇక కేసులోకి వస్తే.. కిడ్నాప్ వెనుక వున్నది ఎవరు అని పరిశోధిస్తుండగా కాలాబండ ప్రాంతంలో బోయ అనే ఓ కిరాతకుడు దీని వెనుక వున్నాడని నిర్ధారణ కి వస్తారు. బోయని అదుపులోకి తీసుకుంటారు. ఐతే బోయ పొలీసుల అదుపులో ఉండగానే మరో కిడ్నాప్ జరగడంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ కేసుని తీవ్రంగా పరిశోథిస్తున్న ఆధ్యకి ఈ కిడ్నాప్ ల వెనుక వున్న వ్యక్తికి సంబధించిన ఒక క్లూ దొరుకుతుంది. కిడ్నాపర్ కేవలం రెడ్ డ్రెస్ వేసుకున్న వారినే టార్గెట్ చేస్తున్నాడు. అలాగే ఓ గొర్రె తలని పోలిన మాస్క్ కూడా క్లూగా దొరుకుతుంది. ఈ రెండు క్లూలతో ఈ కేసుని అధ్య, అభయ్ ఎలా చేధించారు? ఈ కేసుకి 1908 లోని అండమాన్ నికోబార్ దీవిలో నివసించిన ఓ తెగకి లింక్ ఏమిటి ? చివరికి కిడ్నాపర్ దొరికాడా? అసలు ఎందుకు కిడ్నాపులు చేస్తున్నాడు? అనేది తక్కిన కథ.
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ దాదాపు ఒక లైన్ లోనే వుంటాయి. ఎక్కడో ఒక హత్య/ కిడ్నాప్ జరుగుతుంది. దాని వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసుల విచారణ సాగుతుంది. ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ల సక్సెస్.. కథలో కొత్త కోణం, అప్పటివరకూ ప్రేక్షకులకు చూడని విషయం ఎదో చూపించడంపై ఆధారపడి వుంటుంది. హిడింబ దర్శకుడు అనిల్ కూడా కొత్త పాయింట్ నే పట్టుకున్నాడు.
హిడింబ కథని చాలా ఆసక్తికరంగా మొదలుపెట్టాడు దర్శకుడు. ఓ అర్ధరాత్రి, గుడ్లగూబ చూపు, ఒంటరిగా వున్న మహిళ సడన్ గా అదృశ్యమైపోవడం, భీవత్సమైన బ్యాగ్ గ్రౌండ్ స్కోర్.. ఈ సెటప్ అంతా చూస్తే చాలా ఎక్సయిటింగ్ కంటెంట్ చూడబోతున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఐతే ఎప్పుడైతే ఈ కేసు విచారణ మొదలౌతుందో ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోతుంది. విచారణలో వేగం వుండదు. ఇలాంటి సినిమాలకు ఇన్వెస్టిగేషన్ చేసే అధికారి తెలివిగా పదునుగా ఆలోచిస్తే చూస్తున్న ప్రేక్షకుడికి కూడా థ్రిల్ వుంటుంది. కానీ హిడింబ విచారణ నత్తనడకన సాగుతుంది. బోయ ని పట్టుకునే కాలా బండ ఎపిసోడ్ మాత్రం కేజీఎఫ్ కలర్ టింట్ లో బోయపాటి ఫైట్ సీక్వెన్స్ ల సాలిడ్ గా తీశారు. బోయ పాత్రతో ఈ కేసులో ప్రేక్షకులని తికమక చేయడానికి ప్రయత్నించాడు దర్శకుడు. ఐతే ఈ సంగతి చాలా మందికి అక్కడే అర్ధమైపోతుంది. బోయ పట్టు బడిన తర్వాత కూడా మరో కిడ్నాప్ జరుగుతుందని రెండు సీన్లుకు ముందే ఊహిస్తాడు ప్రేక్షకుడు. సరిగ్గా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టే మరో కిడ్నాప్ సీన్ జరుగుతుంది.
ఇలాంటి కథల్లో విచారణ అధికారికి క్లూ దొరికే సీన్ చాలా పకడ్బందీగా వుండాలి. ఆ క్లూతో ప్రేక్షకులు కూడా ఎక్సయిట్ అవ్వాలి. హిడింబలో దొరికే క్లూ గురించి ఆల్రెడీ ట్రైలర్ లోనే చెప్పేశారు. అలాంటపుడు ఆ సీక్వెన్స్ లోకి ముందే వెళ్లిపోవాలి. ఇంటర్వెల్ కి ముందు గానీ రెడ్ డ్రెస్ వేసుకుంటున్న అమ్మాయిలనే కిడ్నాప్ చేస్తున్నారనే క్లూ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కి దొరక్కపోవడం, అది ఆల్రెడీ ట్రైలర్ లోనే వుండటం చూస్తే.. కాస్త అపరిపక్వంగా అనిపిస్తుంది. అయితే దర్శకుడు వాడిన స్క్రీన్ ప్లే టెక్నీక్ మాత్రం బాగానే వర్క్ అవుట్ అయ్యింది. రెండు కాలాల్లో జరిగిన సన్నివేశాల్ని, ఒకే టైమ్ లైన్ మీద చూపించి ఆసక్తిని పెంచారు. విరామ సన్నివేశం కూడా ఫర్వాలేదనిపిస్తుంది.
అసలు దర్శకుడు బలంగా నమ్ముకున్న పాయింట్ సెకండ్ హాఫ్ లో మొదలౌతుంది. కథ కేరళకి మారిన తర్వాత హిడింబ పుస్తక రచయిత చెప్పే కొన్ని సంగతులు ఆసక్తికరంగా వుంటాయి. అండమాన్ జైలు నేపధ్యం, అక్కడ దీవుల్లోని ఓ తెగ గురించి చూపించే సన్నివేశాలు క్యూరియాసిటీని కలిగిస్తాయి. దర్శకుడి దగ్గర ఎవరికీ పెద్దగా తెలియని ఒక చరిత్ర లాంటి సమాచారం వుంది. దాన్ని బలంగా నమ్ముకున్నాడు. అది ఎవరూ రాయని చరిత్రగా భావించి ఈ కథని రాసుకున్నాడు. ఐతే ఏదైనా ఒక సమాచారాన్ని కథగా మార్చడానికి చాలా నేర్పు కావాలి. ఈ విషయంలో దర్శకుడు కల్పన శక్తికి మరింతగా పదును పెట్టాల్సింది. దర్శకుడు నమ్ముకున్న కొంత సమాచారం అది కేవలం సమాచారంగా మిగిలిపోయింది తప్పితే కథ లోకి సరిగ్గా బ్లెండ్ కాలేదు. రియల్ ఫాంటసీ కంటే వైల్డ్ ఫాంటసీ ఎక్కువైపోయింది. ఒకదశలో కథలోని సహజత్వం కూడా లోపించింది. ఇలాంటి కథలు చెప్పేటప్పుడు నిజంగా ఇలా జరిగే అవకాశం వుందనే భావన ప్రేక్షకుడిలో కలగాలి. అలాంటి భావన కలిగించలేకపోయాడు దర్శకుడు. పైగా సెకండ్ హాఫ్ కాస్త సాగాదీత వ్యవహారం కూడా మారింది. కేరళలో అధ్య తండ్రి చేసే విచారణ, తర్వాత మరో పోలీసు ఆఫీసర్ చెప్పే కథ.. ఇవన్నీ గ్రిప్పింగా సాగాల్సిన సెకండ్ హాఫ్ నిడ్రాగ్ చేసేశాయి. ఇక చివర్లో ఇందులో దర్శకుడు బలంగా నమ్ముకున్నా ట్విస్ట్ వుంది. అది మాత్రం షాకింగ్ గానే ఉంటుంది. దాన్ని డీల్ చేసిన విధానం కూడా బాగుంది. సినిమా లో ట్విస్ట్ రివీల్ అయ్యాక.. ప్రేక్షకుల మైండ్ లో.. మొత్తం జరిగిన కథ అంతా ఒక్కసారి ఫ్లాష్ లా మెదులుతుంది. కొన్ని సీన్లు భలే డిజైన్ చేశాడే అనిపిస్తుంది. ఇంకొన్ని చోట్ల ప్రేక్షకులను తప్పు దారి పట్టించిన ఫీలింగ్ కలుగుతుంది.
అశ్విన్ బాబు తన పాత్రకు తగ్గ బాడీని పెంచాడు. దాదాపు మూడేళ్ళు ఈ సినిమా ప్రయాణం జరిగింది. అన్ని రోజులు ఆ ఫిజిక్ ని ఒకేలా వుంచడం మామూలు విషయం కాదు. తన పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. బోయపాటి హీరో రేంజ్ లో ఫైట్లు చేశాడు. తంతే తాటిచెట్టు కూడా గాల్లోకి లేచిపోయే ఫైట్స్ ఇందులో వున్నాయి. ఐతే ఈ కథ కు అలాంటి ఫైట్ వున్నా అక్షేపనీయం కాదు. నందిత పాత్రని కాస్త లైటర్ వెయిన్ లో డీల్ చేశారు. టీంలో ఆమెనే బాస్ . కానీ ఆ పాత్రని పవర్ లెస్ గా ట్రీట్ చేశారు. తన నటన ఓకే అనిపిస్తుంది. ఒక పాటలో కాస్త శ్రుతిమించిన రొమాన్స్ వుంది. కానీ చివర్లో దానికి ఒక జస్టిఫీకేషన్ ఇచ్చారు. మకరంద్ దేశ్ పాండే ది కీలకమైన పాత్ర. బోయ పాత్రలో చేసిన రాజీవ్ క్రూరంగా కనిపించాడు. శ్రీనివాస్ రెడ్డి, రఘు కుంచె, రాజీవ్ కనకాల లతో పోల్చుకుంటే సిజ్జు పాత్రకు కొంత ప్రాధన్యత వుంటుంది. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
హిడింబ సౌండింగ్ బావుంది. నేపధ్య సంగీతాన్ని టెర్రిఫిక్ గా చేశారు. కేజీఎఫ్ స్టయిల్ లో కొన్ని షాట్లు ఎడిట్ చేశారు. నిజానికి ఈ కథకు అలాంటి ఎడిటింగ్ అనవసరం. బహుశా మేము ట్రెండ్ లో వున్నామని నిరూపించుకోవడానికి తప్పితే ఆ ప్యాట్రన్ ఈ సినిమాకి అక్కర్లేదు. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా వుంది.
దర్శకుడు అనిల్ ప్రతిభా వంతుడే. షాట్ మేకింగ్ బాగుంది. తన డీటైలింగ్ ఆకట్టుకుంటుంది. లిమిటెడ్ బడ్జెట్ లో క్వాలిటీ సినిమా అందించాడు. తన దగ్గర ఎవరికీ పెద్దగా పరిచయం లేని కొంత సమాచారం లాంటి ఓ నేపధ్యం వుంది. అది ఎక్కడా రాయనిదని భావించి ఆ నేపధ్యంలో హిడింబ కథ సెటప్ చేసి, క్లైమాక్స్ ట్విస్ట్ ని బలంగా నమ్ముకొని ఈ సినిమా చేశాడు. ఆ నేపధ్యం, క్లైమాక్స్ ట్విస్ట్ కొత్తగా అనిపిస్తాయి. రెండు జోనర్లని కలిపి ఒక కొత్త తరహా కథ చెప్పే ప్రయత్నం చెయ్యడం మెచ్చుకొదగిన విషయమే. అయితే.. స్క్రీన్ ప్లే పరంగా మరింత వేగం పెంచి, విచారణ లో కొత్త పంధా అనుసరిస్తే ఫలితం మెరుగ్గా ఉండేది.
తెలుగు360 రేటింగ్ : 2.5/5