78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ నిఘా వర్గాలు హైఅలర్ట్ ప్రకటించాయి. దేశ రాజధానిలో భారత ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి ఉగ్రముప్పు పొంచి ఉందని వెల్లడించాయి. ఈమేరకు హస్తినలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పాక్ ఉగ్రవాదులు..ఢిల్లీలో విధ్వంసానికి ప్లాన్ చేసినట్లుగా గుర్తించిన నిఘా వర్గాలు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశాయి. అయితే, కేవలం ఆగస్ట్ 15 ఒక్కరోజు మాత్రమే ఉగ్రదాడి జరుగుతుందని చెప్పలేమని, రెండు రోజుల తర్వాత కూడా దాడులు జరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.
భారత్ లో స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఉగ్రదాడికి ప్లాన్ చేసిన సంభాషణను భారత నిఘా వర్గాలు వినడంతో ఈ విషయం బట్టబయలు అయింది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి విధ్వంస ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత చేపట్టాలని ఢిల్లీ పోలీసులను నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.
ఇప్పటికే కథువాలో ఆయుధాలతో సంచరించిన ఉగ్రమూకలు పఠాన్ కోట్ లోకి చొరబడే అవకాశాలను కొట్టిపారేయలేమని అధికారులు చెబుతున్నారు. ఈమేరకు ఢిల్లీలో అనుమానితుల కదలికలపై నిఘా పెంచిన పోలీసులు .. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగే ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.