కాంగ్రెస్ పార్టీని ఎవరో ఓడించాల్సిన పని లేదు.. ఆ పార్టీని ఆ పార్టీ పెద్దలే ఓడించుకుంటారని చాలా మంది సెటైరికల్ గా చెబుతూ ఉంటారు. ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. అది నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణల్లో మాత్రమే అధికారంలో ఉంది. గెలవాల్సిన హర్యానాలో గెలుపు ముందు బోర్లా పడ్డారు. మహారాష్ట్రలోనూ అంతే. ఇక ఢిల్లీలో అయితే అడ్రస్ లేరు. బీహార్ లో కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అయినా తమ మార్క్ చూపించి ప్రజల్ని మెప్పించాలని అనుకోవాలి. కానీ హైకమండ్ మాత్రం.. సొంత పార్టీ నేతల్ని బలహీనం చేసే టాస్కులు అమలు వస్తోంది.
తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీకి స్కోప్ లేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ.. మునుగోడు ఉపఎన్నికల వరకూ కాంగ్రెస్ భవిష్యత్ పై ఎవరికీ నమ్మకం లేదు. కానీ ఆ తర్వాత బీజేపీ చేసిన మార్పులు.. రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజల నమ్మకం కలిసి కాంగ్రెస్ కు హైప్ వచ్చింది. రేవంత్ రెడ్డి శ్రమ పడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. ఆయనకు తగిన గౌరవం ఇవ్వాల్సి ఉంది. ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కానీ.. కనీసం మంత్రుల్ని ఎంపిక చేసుకునే స్వేచ్చ ఇవ్వలేదు. ఆరు మంత్రి పదవుల్ని ఖాళీగా పెట్టి .. భర్తీ చేయడానికి తంటాలు పడుతున్నారు. కులాల సమీకరణాలు.. జిల్లాల ప్రాతినిద్యం చూసుకుని రేవంత్ ఇచ్చిన జాబితాను పక్కన పెట్టేశారు. దీంతో మీరు సిఫారసు చేసిన వారికే పదవులు ఇస్తానని ఆయన మీడియా ముందు చెప్పుకోవాల్సి వచ్చింది.
హైకమాండ్.. రేవంత్ రెడ్డితో అనుసరిస్తున్న తీరు వల్ల.. ఆయనకు..రాహుల్ కు మధ్య గ్యాప్ పెరిగిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. దీని వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది?. పార్టీలోనే ఉంటూ.. ఇతర పార్టీలతో కుమ్మక్కయి రాజకీయాలు చేసి..తాము కాంగ్రెస్ సీనియర్లం అని సర్టిఫికెట్లు స్వయంగా ఇచ్చుకుని పెత్తనం చేయాలనుకునేవారిని బలపరిచి.. రేవంత్ రెడ్డిని బలహీనపరిచేలా చేస్తే ఎవరికి లాభం. .?. రేవంత్ రెడ్డి పార్టీ కోసం కష్టపడుతున్న తీరుపై ఎలాంటితో ఆయనకు హైకమాండ్ ముద్ర వేయాల్సిన అవసరం లేదు కానీ.. ముందరి కాళ్లకు బంధం వేసి బోర్లా పడేలా చేస్తే మాత్రం.. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి నష్టపోయేది ఏమీ ఉండదని కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా నష్టపోతుందన్న అంచనాలు సహజంగానే వస్తున్నాయి.