ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే… ఓ స్పష్టమైన మార్పు తెలుస్తుంది! తెలంగాణలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా పర్యటన హడావుడి కనిపిస్తోంది. ఆంధ్రాలో జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతల విమర్శలు ప్రముఖంగా వినిపించాయి. ఈ రెండు ఇష్యూస్ నేరుగా భాజపాతో సంబంధం ఉన్నవే. ఇలాంటి సందర్భాల్లో ఆ పెద్దాయన కచ్చితంగా స్పందిస్తారనే అనుకుంటాం. కానీ, ఈసారి ఆయన స్వరమే వినిపించడం లేదు. ఆయనే.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలంటే ఆయనే స్పందించేవారు. పార్టీ బాధ్యతలు ఆయనే నిర్వహించేవారు. కానీ, తాజా పరిణామాలు చూస్తుంటే వెంకయ్యను పక్కన పెట్టారా అనే అనుమానం కలుగుతోంది! భాజపా జాతీయ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో వెంకయ్య నాయుడు పేరే వినిపించకుండా చేశారనే చెప్పాలి.
నిజానికి, ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడును వెంకయ్య ఏ రేంజిలో వెనకేసుకొస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయడంలో ఆయనకు ఆయనే సాటి. చంద్రబాబు పట్ల వెంకయ్య అనుసరిస్తున్న ఈ అతి ప్రేమ ధోరణి వల్లే ఆంధ్రాలో భాజపా ఎదగలేకపోయిందనేది వాస్తవం. ఇదే విషయాన్ని ఎప్పటికప్పుడు ఏపీ భాజపా నేతలు వాపోతూ ఉంటారు. అయితే, ఇన్నాళ్లకు తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దకాలంగా భాజపా ఊపందుకోలేకపోవడానికి కారణం వెంకయ్య నాయుడే అని అధిష్టానం గుర్తించింది అని భాజపా వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఇదే విషయమై పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగిందనీ, ఆయనపై అంక్షితలు వేశారనీ, పార్టీ కార్యక్రమాల్లో కొన్నాళ్లు జోక్యం చేసుకోవద్దని మర్యాదపూర్వకంగానే వెంకయ్యకు భాజపా పెద్దలు చెప్పారని తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో భాజపా విస్తరణను పార్టీ ఛాలెంజ్ గా తీసుకుందనీ, ఉనికి లేని రాష్ట్రాల్లో కూడా భాజపా చక్రం తిప్పుతున్నప్పుడు తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఎందుకు ముందుకు సాగలేకపోతున్నామనే చర్చ ఇటీవల పార్టీ వర్గాల్లో తీవ్రంగా జరిగిందని సమాచారం. అందుకే, ఇకపై తెలుగు రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను స్వయంగా డీల్ చేసేందుకు అమిత్ షా సిద్ధమయ్యారట. ఇకపై ప్రభుత్వ కార్యక్రమాలకే వెంకయ్యను పరిమితం కావాలని సూచించారనీ, పార్టీ వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోవద్దని చెప్పేశారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికలను దృష్టి పెట్టుకుని పార్టీ బాగు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్నట్టుగా వెంకయ్యకు చెప్పినట్టు కథనాలు వస్తున్నాయి.
అమిత్ షా పర్యటన సందర్భంగా వెంకయ్య పేరు వినిపించకపోవడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. ప్రధానిని జగన్ కలిశాక ఏపీలో రాజకీయంగా ఇంత రగడ జరుగుతూ ఉన్నా వెంకయ్య నాయుడు పెద్దగా స్పందించకపోవడానికి కారణం కూడా ఇదే అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఎదుగుదలకు ఇకపై భాజపా వ్యూహాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.