రేవంత్ రెడ్డి హైకమాండ్ వద్ద పూర్తి స్థాయి పలుకుబడి సాధించుకుంటున్నారు. ఢిల్లీ పర్యటనలో కీలక అంశాలపై అనుమతి కోసం ఆయన హైకమాండ్ పెద్దలను కలిశారు. మిగిలిన క్యాబినేట్ బెర్త్‌లు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవులపై చర్చించారు. ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేలా మంత్రివర్గంలో కొత్త వారికి చోటు, ఎమ్మెల్సీల ఎంపిక నిర్ణయాన్ని తీసుకోవాలని ఈ విషయంలో హైకమాండ్ నుంచి ఒత్తిళ్లు ఏమీ ఉండవని చెప్పినట్లుగా తెలుస్తోంది.
మంత్రివర్గం విస్తరణ ఉంటుందని భావిస్తున్నందున ఆశావాహులు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌ను కలిసి ఇదే విషయాన్ని వివరించారు. అయితే, ఇప్పటికే క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉందంటూ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేమని చెప్పినట్టు తెలిసింది.
తనకు మంత్రి పదవి ఇవ్వాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సైతం అగ్రనేతలను కలుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ క్రికెటర్ అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్లు మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. ఢిల్లీలో వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. అన్నీ రేవంత్ రెడ్డి చాయిస్ కే వదిలి పెట్టడంతో… అందరూ రేవంత్ వద్దకే పరుగులు పెడుతున్నారు.