బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకునేందుకు రేవంత్ అనుసరిస్తున్న విధానాలతో మొదటికే మోసం వస్తుందని అనుకుంటున్న హైకమాండ్ కొన్ని సూచనలు చేసినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో చేరే వారిని వ్యతిరేకించే నేతలతో ముందుగానే సంప్రదింపులు చేయాలని.. వారిని ఒప్పించిన తర్వాత మాత్రమే చేర్చుకోవాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా చేరికలపై వ్యతిరేకత రావడానికి కారణం తమకు సీటు ఉండదన్న భయమే. అలాంటి భయాలు పెట్టుకోకుండా ముందుగానే హామీలు ఇవ్వాలని హైకమాండ్ సూచిస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అసెంబ్లీ సీట్లు మరో యాభై వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ సీట్ల పునర్విభజన తర్వాతనే వచ్చే ఎన్నికలు జరుగుతాయి. అందుకే నేతలు వచ్చి చేరినా సీనియర్లకు ప్రాధాన్యం తగ్గదని బుజ్జగింపులు ప్రారంభించారు. ముఖ్యంగా పార్టీని అంటి పెట్టుకున్న సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఉంటుందని పిలిచి భరోసా ఇస్తున్నరు. అయితే వారి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలని తాజాగా రేవంత్ కు రూల్స్ పెట్టి పంపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎల్పీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు… వారిపై పార్టీ మార్పు చర్చ జరిగితే ఒత్తిడి వస్తుందని అనుకున్న వారికి ముందుగా కండువా కప్పేశారు. మిగిలిన అందరికీ ఒకే సారి కండువా కప్పే ఆలోచనలో ఉన్నారు.